మహిళలపై అఘాయిత్యాలు సహించం – పీఎం
తీవ్రమైన చర్యలు ఉంటాయని మోడీ వార్నింగ్
న్యూఢిల్లీ – ఈ దేశంలో రోజు రోజుకు మహిళలను లక్ష్యంగా చేసుకుని దారుణాలకు పాల్పడుతున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. దేశ అభివృద్దిలో వారు కీలకమైన పాత్ర పోషిస్తున్నారని, అన్ని రంగాలలో ముందంజలో కొనసాగుతున్నా ఇంకా దాడులకు గురి కావడం తనను మరింత ఆందోళనకు గురి చేస్తోందని పేర్కొన్నారు పీఎం.
78వ స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఎర్రకోట పై జాతీయ పతాకాన్ని ఎగుర వేశారు మోడీ. ఈ సందర్బంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఇవాళ ఎర్రకోట నుండి నా బాధను మరోసారి చెప్పాలని అనుకుంటున్నాను.
ఒక సమాజంగా, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల గురించి మనం తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు నరేంద్ర మోడీ. దీనిపై సర్వత్రా చర్చ జరగాలని పిలుపునిచ్చారు .
దీనిపై అంతటా ఆగ్రహం వ్యక్తమవుతోంది. దేశం, సమాజం, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ క్రూరమైన నేరాలను తీవ్రంగా పరిగణించాలని అన్నారు. ఎవరైతే యువతులు, బాలికలు, మహిళలను లక్ష్యంగా చేసుకుంటారో, దారుణాలకు తెగ బడతారో వారికి కఠినమైన శిక్షలు పడాలని అన్నారు నరేంద్ర దామోదర దాస్ మోడీ.