ఒకే దేశం..ఒకే ఎన్నికలు ఉండాలి – మోడీ
ఎర్రకోట వేదికగా ప్రధానమంత్రి సందేశం
ఢిల్లీ – ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత దేశం అభివృద్ది చెందాలంటే ఒకే దేశం ఒకే ఎన్నికల వ్యవస్థ ఉండాలని అన్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఎగుర వేశారు. అనంతరం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. మోడీ వరుసగా 11వ సారి జెండాను ఎగుర వేయడం విశేషం.
దేశం ముందుకు వెళ్లడానికి సైనికులు, రైతులు, యువతీ యువకులు కీలకమైన పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. వారందరికీ నేను శిరసు వంచి నమస్కరిస్తున్నానని అన్నారు మోడీ. 2036లో ఒలింపిక్స్ గేమ్స్ ను భారత దేశంలో నిర్వహించాలన్నది తన కల అని , దాని కోసం శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తానని చెప్పారు.
లోకల్ కోసం వోకల్ అనేది స్వావలంబన దిశగా ఓ మంత్రం లాగా మారి పోయిందని చెప్పారు. ప్రతి ప్రయత్నం వెనుక మేరా భారత్ మహాన్ అన్న పదం ఆత్మ లాగా ప్రతి భారతీయుడిలో చేరి పోయిందన్నారు.
దేశ యువత నెమ్మదిగా వెళ్లాలని అనుకోవడం లేదని, వారు తమ కలలను సాకారం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారని, వారిని ఈ సందర్బంగా అభినందిస్తున్నట్లు చెప్పారు మోడీ. కరోనా లాంటి విపత్తును జాతి సగర్వంగా ఎదుర్కొందని అన్నారు.
మధ్య తరగతి ప్రజల ఆశలను వమ్ము చేయకుండా ముందుకు వెళతామని ప్రకటించారు ప్రధాన మంత్రి.