రేవంత్ రెడ్డి వలసవాద పుత్రుడు
ఎమ్మెల్సీ దేశిపతి శ్రీనివాస్ ఫైర్
హైదరాబాద్ – రేవంత్ రెడ్డి తెలంగాణోడు కాదని వలసవాద పుత్రుడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ దేశిపతి శ్రీనివాస్. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్న చోట రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతుండటం ముమ్మాటికి తెలంగాణ అస్తిత్వంపై దాడేనని అన్నారు.
హై కమాండ్ మెప్పు కోసం సీఎం ఇలా చేస్తున్నాడని, తెలంగాణ సమాజం ఒప్పుకోదన్నారు. సీఎంకు తెలంగాణ సోయి లేదన్నారు. ఓ వైపు పంధ్రాగస్టును జరుపుకుంటుంటే ఇక్కడ తెలంగాణ స్వాభిమానం మీద దాడి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక తెలంగాణ వాదం మసక బారి పోయిందని వాపోయారు. చార్మినార్, కాకతీయ తోరణాల చిహ్నాలను హేళన చేశారని మండిపడ్డారు. దేశ స్వాతంత్ర ఉద్యమంలో భరతమాత ఓ ప్రేరణగా ఉంటే.. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ తల్లి ప్రేరణ అని గుర్తు పెట్టుకుంటే మంచిదన్నారు.
సచివాలయం, అమరజ్యోతి మధ్య ఉండాల్సింది తెలంగాణ తల్లి విగ్రహమేనని రాజీవ్ గాంధీ విగ్రహం కాదన్నారు దేశపతి శ్రీనివాస్. తెలంగాణ బిడ్డ మాజీ సీఎం అంజయ్యను అవమానించింది ఇంకా ప్రజలు మరిచి పోలేదన్నారు. అసలు రాజీవ్ గాంధీకి తెలంగాణతో ఏం సంబంధం ఉందంటూ ప్రశ్నించారు.