రైతన్నల సంతోషం రాష్ట్రం సుభిక్షం
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కామెంట్
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రైతన్నలు లేక పోతే దేశమే లేదన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజే తెలంగాణ రైతుకు ఆర్థిక స్వాతంత్య్రం వచ్చిందని అన్నారు.
ఘనంగా చెప్పుకునేలా రూ.2 లక్షల రుణ మాఫీ అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. దేశానికి పట్టెడు అన్నం పెట్టే రైతన్నలు సుఖ సంతోషాలతో ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందన అన్నారు రేవంత్ రెడ్డి. అందుకే రూ. 31 వేల కోట్లు ఖర్చు చేసి, అష్ట కష్టాలు పడి తెలంగాణ రైతులను రుణ విముక్తులు చేస్తున్నామని చెప్పారు.
రుణ మాఫీ కార్యక్రమంతో జన్మ ధన్యమైనట్లుగా భావిస్తున్నానని అన్నారు సీఎం. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు ఎ. రేవంత్ రెడ్డి.
తమది రైతు పక్షపాత ప్రభుత్వమని, రుణ మాఫీ పథకంలో అర్హులైన ప్రతి ఒక్క రైతుకు న్యాయం జరుగుతుందని సీఎం భరోసా ఇచ్చారు. రుణమాఫీ ప్రక్రియలో సాంకేతిక కారణాలతో ఎక్కడైనా చిన్న ఇబ్బందులు వస్తే వాటిని పరిష్కరించే బాధ్యత ప్రభుత్వ వ్యవసాయ శాఖ తీసుకుంటుందని తెలిపారు.