అన్న క్యాంటీన్లు ఆకలి తీర్చే నేస్తాలు
స్పష్టం చేసిన నారా భువనేశ్వరి
అమరావతి – ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన అన్న క్యాంటీన్లు లక్షలాది మంది పేదలు, సామాన్యుల ఆకలిని తీరుస్తున్నాయని అన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి. ఆమె తన భర్తతో కలిసి తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పుట్టిన గుడివాడలో లాంఛనంగా అన్న క్యాంటీన్ ను ప్రారంభించారు. ఈ సందర్బంగా స్థానికులకు స్వయంగా చంద్రబాబు, భువనేశ్వరి ఆప్యాయంగా వడ్డించారు.
స్థానికులతో కలిసి భోజనం చేశారు. వారి క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకున్నారు. ఏ పేద కుటుంబమూ పస్తులు ఉండ కూడదని పదే పదే తన తండ్రి ఎన్టీఆర్ చెబుతూ ఉండే వారని గుర్తు చేసుకున్నారు నారా భువనేశ్వరి.
తాను ముఖ్యమంత్రిగా కొలువు తీరిన వెంటనే పేదలు ఆకలితో ఉండ కూడదనే ఉద్దేశంతో 2 రూపాయలకే కిలో బియ్యం పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టారని, ఈ పథకం ఆనాడు దేశంలోనే సంచలనం సృష్టించిందని అన్నారు.
ఏపీలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడిన సమయంలో అన్న క్యాంటీన్లను తన తండ్రిని దృష్టిలో పెట్టుకుని ప్రారంభించడం జరిగిందన్నారు. కానీ 5 ఏళ్ల పాటు పేదలను ఆకలికి దూరం పెట్టాడంటూ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై మండిపడ్డారు నారా భువనేశ్వరి.