మహిళలూ తప్పైంది మన్నించండి
ఎవరినీ కించ పర్చాలనే ఉద్దేశం లేదు
హైదరాబాద్ – భారత రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎట్టకేలకు దిగి వచ్చారు. తనపై పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం కావడంతో స్పందించారు. శుక్రవారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు.
తాను మహిళల ఉద్దేశించి కావాలని మాట్లాడ లేదని స్పష్టం చేశారు. కొందరు కావాలని రాద్దాంతం చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను వేరే దృష్టి కోణంలో మాట్లాడానని, దానిని తప్పుగా అర్థం చేసుకున్నారంటూ పేర్కొన్నారు కేటీఆర్.
మహిళలు ప్రయాణం చేసేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారని, వారి కష్టాలను పరిగణలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం , టీఎస్ఆర్టీసీ సంస్థ బస్సులను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కోరారని అన్నారు మాజీ మంత్రి.
అయితే..నిన్న పార్టీ సమావేశంలో అనుకోకుండా చేసిన వ్యాఖ్యల పట్ల మహిళలు, యువతులు , సోదరీమణులు మనస్తాపం చెందితే తనను మన్నించాలని కోరారు కేటీఆర్. తాను అలా అని ఉండాల్సింది కాదని, యథాలాపంగా కామెంట్స్ చేశానని పేర్కొన్నారు. నా అక్క చెల్లెళ్లను కించ పరిచే ఉద్దేశం తనకు ఏ మాత్రం లేదని స్పష్టం చేశారు.