కుట్ర నిజం వినేష్ ఫోగట్ కు అన్యాయం
రాకేశ్ టికాయత్ షాకింగ్ కామెంట్స్
ఉత్తర ప్రదేశ్ – రైతు ఉద్యమ నాయకుడు రాకేశ్ టికాయత్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్రాన్స్ రాజధాని పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్ గేమ్స్ 2024 లో భారత దేశానికి చెందిన రెజ్లర్ వినేష్ ఫోగట్ కు తీవ్ర అన్యాయం జరిగిందని వాపోయారు .
రెజ్లర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ , భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీ బ్రిజ్ భూషణ్ వేధింపులకు మహిళా రెజ్లర్లు పోరాటం చేయడాన్ని తట్టుకోలేక పోయారని, దీని వెనుక కేంద్ర ప్రభుత్వం కుట్ర దాగి ఉందని సంచలన ఆరోపణలు చేశారు రాకేశ్ టికాయత్. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
కేవలం 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉందనే కారణంతో కావాలని వినేష్ ఫోగట్ ను తప్పుదారి పట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు రైతు సంఘం నేత. వినేష్ ఫోగట్‌పై కుట్ర జరిగిందని దేశం మొత్తం చెబుతోందని అన్నారు.
టీమ్ మొత్తం ఆమెతో పాటే, మేనేజ్‌మెంట్ అంతా అక్కడే ఉందన్నారు. ఇది పూర్తిగా కుట్రలో భాగంగా జరిగిందని ఆరోపించారు. దీనిపై వెంటనే దర్యాప్తు చేయాలని రాకేశ్ టికాయత్ డిమాండ్ చేశారు. ప్రధాన న్యాయమూర్తితో విచారణ చేపట్టాలని కోరారు రైతు ఉద్యమ నాయకుడు.