కేసీఆర్ కు గవర్నర్..కేటీఆర్ కు మినిష్టర్
బీజేపీలో బీఆర్ఎస్ విలీనం పక్కానన్న సీఎం
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మరోసారి బీఆర్ఎస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. భారతీయ జనతా పార్టీలో బీఆర్ఎస్ విలీనం తప్పదన్నారు. వారికి రాష్ట్రంలో మరో ప్రత్యామ్నాయం కనిపించడం లేదని చెప్పారు.
శుక్రవారం సీఎం మీడియాతో మాట్లాడారు. విలీనంలో భాగంగా కేంద్రంలోని బీజేపీ బంపర్ ఆఫర్ ఇచ్చిందన్నారు. ఆ విషయం తనకు విశ్వసనీయంగా తెలిసిందన్నారు. ఇందులో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ కు గవర్నర్ పదవితో పాటు ఆయన తనయుడు కేటీఆర్ కు కేంద్ర కేబినెట్ లో చోటు కల్పించనున్నట్లు చెప్పారు.
ఇక అల్లుడు తన్నీరు హరీశ్ రావు భారతీయ జనతా పార్టీ నుంచి అపోజిషన్ లీడర్ గా ఉంటారని ఎద్దేవా చేశారు. ఇక బీఆర్ఎస్ పార్టీకి రాజ్యసభలో నలుగురు సభ్యులు ఉన్నారని, ఆ పార్టీ విలీనం కారణంగా కవితకు రాజ్యసభ సీటు కూడా ఇస్తారని అన్నారు ఎ. రేవంత్ రెడ్డి. ఆమెకు త్వరలోనే బెయిల్ రావడం ఖాయమని జోష్యం చెప్పారు.
మొత్తంగా తాజాగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ ఘాటు కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.