సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
వంద శాతం రుణ మాఫీ చేస్తే రాజీనామా
హైదరాబాద్ – రాష్ట్రంలో మాటల తూటాలు పేలుతున్నాయి. సీఎం వర్సెస్ కేటీఆర్ మధ్య విమర్శలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ టూర్ లో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతోందని అన్నారు. అంతే కాదు బీజేపీ కూడా కేసీఆర్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిందన్నారు. కేసీఆర్ కు గవర్నర్, కేటీఆర్ కు కేంద్ర మంత్రి పదవి రానుందని అన్నారు.
ఇదే సమయంలో మాజీ మంత్రి కేటీఆర్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. నిరాధారమైన ఆరోపణలు చేయడం అలవాటుగా మారిందన్నారు. దేశంలోనే అబద్దాలు చెప్పడంలో సీఎం నెంబర్ వన్ అంటూ ఎద్దేవా చేశారు.
రుణ మాఫీ గురించి రైతులను మోసం చేశారంటూ ఆరోపించారు. ఎక్కడైనా వంద శాతం రుణ మాఫీ జరిగిందని నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు కేటీఆర్. సవాల్ ను స్వీకరించే దమ్ము , ధైర్యం సీఎంకు ఉందా అని ప్రశ్నించారు.
కొడంగల్‌కి పోదామా.. కొండారెడ్డిపల్లికి పోదామా… ఎక్కడికైనా సరే పోదాం.. అక్కడ 100 శాతం రుణ మాఫీ అయ్యిందని నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు కేటీఆర్. సన్యాసం తీసుకుంటానని అన్నారు.