సీఎంతో టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ భేటీ
రాష్ట్రంలో పెట్టుబడుల అంశంపై విస్తృత చర్చ
అమరావతి – ప్రముఖ సంస్థ టాటా సన్స్ గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ శుక్రవారం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా రాష్ట్రంలో పెట్టుబడుల అంశంపై విస్తృతంగా చర్చించారు.
రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ది, స్వర్ణాంధ్రప్రదేశ్- విజన్ 2047 రూపకల్పన అంశాలపై సమావేశంలో చర్చకు వచ్చాయి. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం. పారిశ్రామిక అభివృద్దికి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు, ప్రణాళికలు అందించేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
దేశంలో పేరున్న పారిశ్రామిక వేత్తలు, ఆయా రంగాల నిపుణులతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. సిఎం చైర్మన్ గా, టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ కో చైర్మన్ గా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు చంద్రబాబు నాయుడు.
2047 నాటికి ఎపీని నెంబర్ 1 స్టేట్ చేసే లక్ష్యంతో విజన్ 2047 రూపొందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. దీనిలో భాగంగా పారిశ్రామికాభివృద్దికి చేపట్టాల్సిన చర్యలపై పని చేయనుంది టాస్క్ ఫోర్స్. అంతే కాకుండా అమరావతిలో సిఐఐ భాగస్వామ్యంతో స్టేట్ ఆఫ్ సెంటర్ ఫర్ గ్లోబల్ లీడర్ షిప్ సంస్థ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు సీఎం.