భారీ వర్షం భాగ్యనగరం అతలాకుతలం
నాలోకి దూసుకెళ్లిన కారును కాపాడిన పోలీసులు
హైదరాబాద్ – హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జన జీవనం స్తంభించి పోయింది. భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వర్షపు ధాటికి రోడ్లపైకి నీరు వచ్చి చేరింది. పాదచారులు, వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రధాన కూడళ్లలో ఎక్కడికక్కడ కిలోమీటర్ల పొడవునా వాహనాలు నిలిచి పోయాయి. నగర వాసులు నరకాన్ని అనుభవించారు.
ఇదిలా ఉండగా వనస్థలిపురంలో భారీ వర్షం కారణంగా నాలా లోకి కారు దూసుకెళ్లింది. దీంతో సకాలంలో సమయ స్పూర్తితో వ్యవహరించారు పోలీసులు. ముగ్గురు చిన్నారులతో సహా కుటుంబాన్ని కాపాడారు ట్రాఫిక్ పోలీసులు.
హయత్ నగర్ కు చెందిన వినోద్ తన భార్య పిల్లలతో సహా కుటుంబ సమేతంగా ఎల్బీనగర్ వైపునకు జోరు వాన లో కారులో వెళ్తుండగా, వనస్థలిపురం పనామా చౌరస్తా దగ్గరకు రాగానే వరద ఉధృతి కి కారు అదుపు తప్పి పక్కన ఉన్న వర్షపు నీటి నాలా లోకి దూసుకొని వెళ్లింది.
అక్కడే విధుల్లో ఉన్న వనస్థలిపురం ట్రాఫిక్ సి.ఐ వెంకటేశ్వర్లు, కానిస్టేబుళ్లు సైదులు, శ్రీనివాసరావు గమనించి సమయస్ఫూర్తితో వ్యవహరించారు.
కారులో ఉన్న ముగ్గురు చిన్నారుల తో సహా కుటుంబము మొత్తాన్ని సురక్షితంగా కాపాడారు. వరద ఉధృతి పూర్తిగా తగ్గిన తర్వాత ట్రాఫిక్ సి.ఐ. లు వెంకటేశ్వర్లు, శ్రీనివాస్ రెడ్డి భారీ క్రేన్ సహాయంతో నాలాలో ఇరుక్కొన్న కారును బయటకు తీయించారు.
కుటుంబాన్ని కాపాడిన ట్రాఫిక్ పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు.