హరీశ్ రావు ఇంటిపై దాడి కాంగ్రెస్ పనే
ఇది పిరికిపందల చర్య అన్న కేటీఆర్
హైదరాబాద్ – బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి కేటీఆర్. శనివారం ఆయన ట్విట్టర్ వేదికగా రాహుల్ గాంధీని ఏకి పారేశారు. ఇదేనా మీ మొహబ్బత్ కీ దుఖాన్ అంటూ ఎద్దేవా చేశారు.
ఈ దాడి కాంగ్రెస్ పార్టీకి చెందిన గూండాల పనేనంటూ ఆరోపించారు కేటీఆర్. గత పదేళ్ల కాలంలో ఇలాంటి దాడులకు తాము ఎప్పుడూ పాల్పడలేదని గుర్తు చేశారు. ఇది పూర్తిగా కక్ష సాధింపు ధోరణి తప్ప మరోటి కాదన్నారు.
పాలన చేత కాని వాళ్లే దాడులకు దిగుతారని ఆరోపించారు కేటీఆర్. తెలంగాణ రాష్ట్రం పగ సాధింపు రాజకీయాలకు, రాజకీయ హింసకు దూరంగా ఉన్నదని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అల్లర్లు, దాడులు, కేసుల పరంపర కొనసాగుతోందని ధ్వజమెత్తారు.
రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, సీఎం రేవంత్ రెడ్డికి, ఆయన పరివారానికి, కాంగ్రెస్ పార్టీకి తగిన రీతిలో బుద్ది చెప్పడం ఖాయమని అన్నారు కేటీఆర్. ఇలాంటి దాడులను ప్రతి ఒక్కరు ఖండించాలని పిలుపునిచ్చారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని పేర్కొన్నారు.