వినేష్ ఫోగట్ కు గ్రాండ్ వెల్ కమ్
దేశ ప్రజలందరికీ రుణపడి ఉన్నా
ఢిల్లీ – పారిస్ ఒలింపిక్స్ 2024లో కేవలం 100 గ్రాముల బరువు కారణంగా ఫైనల్ నుంచి అనర్హత వేటుకు గురైన రెజ్లర్ వినేష్ ఫోగట్ శనివారం ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్బంగా ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుంచి ఆమెకు దారి పొడవునా ఘన స్వాగతం లభించింది.
జాతీయ పతాకాలతో ఆమెకు అభిమానులు స్వాగతం పలికారు. నిన్ను చూసి దేశం గర్విస్తోందంటూ నినాదాలు చేశారు. దీంతో ఉద్విగ్న వాతావరణం చోటు చేసుకుంది. వినేష్ ఫోగట్ తనకు లభించిన స్వాగతాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఆమెతో పాటు ప్రముఖ రెజ్లర్ బజరంగ్ పూనియా కూడా ఉన్నారు. ఈ సందర్బంగా వినేష్ ఫోగట్ మాట్లాడారు. తాను ఇబ్బందుల్లో ఉన్న సమయంలో తనకు అండగా ఉంటూ , మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా, దేశ ప్రజలందరికీ రుణపడి ఉన్నానని చెప్పారు .
ఈ సందర్బంగా వినేష్ ఫోగట్ కు కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ హుడా, సాక్షి మాలిక్ తో పాటు పలువురు ప్రముఖులు వెల్ కమ్ చెప్పారు.
ఇదిలా ఉండగా వినేష్ సీఏఎస్ ను ఆశ్రయించింది. తనకు రజత పతకాన్ని ఇవ్వాలని కోరింది. అయితే సీఏఎస్ ఆమె దరఖాస్తును తిరస్కరించింది.