తీరని రుణాలు రైతులకు తిప్పలు – కేటీఆర్
రుణం తీరలేదు…బతుకు మారలేదు
హైదరాబాద్ – మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ఇచ్చిన హామీలు ఏమయ్యాయంటూ ప్రశ్నించారు. ప్రశ్నిస్తే దాడులకు తెగ బడుతున్నారని, అసలు రుణాల మాఫీ సంగతి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు.
సీఎం ఒక మాట చెబితే మంత్రులు ఇంకో కామెంట్ చేస్తున్నారంటూ అసలు ఎవరి మాట నమ్మాలో తెలియడం లేదన్నారు కేటీఆర్. శనివారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు. రుణాలు తీరక పోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం రుణాల మాఫీ, విడుదలకు సంబంధించి విడుదల చేసిన ప్రకటన పూర్తిగా అవాస్తవమని తేలి పోయిందన్నారు కేటీఆర్. స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ (ఎస్ఎల్బీసీ) లెక్క ప్రకారం రైతుల రుణాలు రూ. 49,500 కోట్లు చెల్లించాల్సి ఉంటుందన్నారు.
ఇక కేబినెట్ భేటీలో చెప్పింది మాత్రం రూ. 31 వేల కోట్లు మాత్రమేనని, బడ్జెట్ లో కేవలం రూ. 26 వేల కోట్లు మాత్రమేనని అన్నారు. రైతులకు మూడు విడతలు విడుదల చేస్తే ఇందులో ఇచ్చింది కేవలం రూ. 17933 కోట్లు రిలీజ్ చేశారని తెలిపారు కేటీఆర్.