వైద్యురాలి ఘటన బాధాకరం – అనిత
వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్
విశాఖపట్టణం – కోల్ కతాలో చోటు చేసుకున్న వైద్యురాలి దారుణమైన ఘటన తనను తీవ్రంగా బాధకు గురి చేసిందన్నారు ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత. హత్యాచార ఘటనను నిరసిస్తూ శనివారం విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జూనియర్ డాక్టర్లు ఆందోళనకు దిగారు.
ఈ సందర్బంగా వారికి మద్దతు తెలిపారు మంత్రి అనిత వంగలపూడి. తాను కూడా బేషరతుగా డిమాండ్ చేస్తున్నానని, ఆమె పట్ల ప్రవర్తించిన తీరు సభ్య సమాజం తల దించుకునేలా ఉందన్నారు. ఇలాంటి ఘటనలు దేశంలో ఎక్కడా జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు మంత్రి.
రాష్ట్రంలో సైతం బాలికలు, యువతులు, మహిళలకు పూర్తి రక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జూనియర్ డాక్టర్లు చేస్తున్న ఆందోళన సరైనదేనని అన్నారు. ఎవరి ప్రాణమైనా ఒక్కటేనని అన్నారు.
బాధితురాలి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆమె కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు ఈ సందర్బంగా మంత్రి వంగలపూడి అనిత. తక్షణమే ఈ ఘటన వెనుక కారకులైన వారిని అరెస్ట్ చేయాలని, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.