గవర్నర్ నిర్ణయం చట్ట విరుద్దం – డీకే
కుమార స్వామి..బీజేపీ ఆటలు సాగవు
కర్ణాటక – రాష్ట్ర గవర్నర్ గెహ్లాట్ పై నిప్పులు చెరిగారు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. విధాన సౌదలో శనివారం డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగ విరుద్ధమైన, ప్రజాస్వామ్యానికి ప్రాణాంతకమైన లేఖను గవర్నర్ పంపారని ఆరోపించారు.
గత జూలై 26న జారీ చేసిన గవర్నర్ నోటీస్ కు సంబంధించి మంత్రివర్గంలో తాము నిర్ణయం తీసుకున్నామని డీకే శివకుమార్ చెప్పారు. ఆ ఫిర్యాదులో వాస్తవం లేదన్నారు. రాజ్యాంగంలోని అంశాలను వివరించామని తెలిపారు. ఇది పూర్తిగా రాజకీయ కుట్రగా ఆయన అభివర్ణించారు. ముడా కేసులో ఎలాంటి లొసుగులు లేవని గవర్నర్‌కు చెప్పామని అన్నారు.
గవర్నర్ ఆధ్వర్యంలో ప్రభుత్వం పని చేస్తుందని, రాజ్యాంగం విలువలను కాపాడేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు డిప్యూటీ సీఎం. ఇవాళ సీఎం సిద్ధరామయ్యపై ప్రాసిక్యూషన్‌కు అనుమతిస్తూ గవర్నర్ లేఖ పంపడం దారుణమన్నారు. ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వాల్సి ఉంటే, కేసు దర్యాప్తు చేసి, దర్యాప్తు నివేదికను అందిస్తే అనుమతి ఇవ్వవచ్చని స్పష్టం చేశారు .
హెచ్‌డి కుమారస్వామిపై లోకాయుక్తలో విచారణ జరిగిందని, ఆయనపై ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వాలని కోరుతూ లోకాయుక్త గవర్నర్‌కు విజ్ఞప్తి చేసిందన్నారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో 136 మంది ఎమ్మెల్యేల బలానికి, రాష్ట్ర ప్రజలకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయమని ఆరోపించారు.
గవర్నర్ కార్యాలయాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు డీకే శివకుమార్. జోషి, కుమారస్వామి ఈ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని ప్రకటించారు. దానికి తోడు ఈ ముందస్తు అనుమతి కూడా ఇచ్చారు. కేబినెట్ మంత్రులంతా సీఎం వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. పార్టీ కూడా సీఎంకు వెన్నుదన్నుగా నిలుస్తోందన్నారు. న్యాయపరంగా పోరాడుతామని ప్రకటించారు.