రూ. 2 లక్షల లోపు రుణాలను మాఫీ చేశాం
ప్రకటించిన మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు
హైదరాబాద్ – బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారాన్ని తిప్పి కొట్టారు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రూ. 2 లక్షల లోపు రైతు రుణాలన్నింటిని మాఫీ చేయడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు 22,37,848 ఖాతాలకు 17933.19 కోట్ల నిధులు విడుదల చేసామని వెల్లడించారు.
ఏదేని కారణాల వల్ల 2 లక్షల లోపు ఉన్న రుణం మాఫీ కానీ ఖాతాదారుల వివరాలు సేకరించి, పోర్టల్ లో అప్ లోడ్ చేయాలని వ్యవసాయాధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన మొదటి పంట కాలం లోపే 26,140.13 కోట్లు రైతు సంక్షేమానికి ఖర్చు పెట్టామని చెప్పారు. శనివారం తుమ్మల మీడియాతో మాట్లాడారు.
-గత ప్రభుత్వం పెట్టిన రైతుబంధు బకాయిలు, డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీలు ,ఆయిల్ పాం రైతులు, కంపెనీలకు పెట్టిన బకాయిలు, పచ్చిరొట్ట విత్తనాల సబ్సిడీ బకాయిలు చెల్లించామని తెలిపారు.
రాష్ట్రంలోని 35 బ్యాంకులకు సంబంధించిన 3292 బ్రాంచులు , 909 PACS ల నుండి 12 డిసెంబర్ 2018 నుండి 09 డిసెంబర్ 2023 వరకు తీసుకున్న పంట రుణాల వివరాలు తెప్పించడం జరిగిందన్నారు.
పథకం విధి విధానాలు, మార్గ దర్శకాలతో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి పంట కాలంలోనే ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల చేశామన్నారు. జులై 18, 2024 నాడు, లక్ష లోపు రుణాలున్న ఖాతాదారులు 11,50,193 కు 6098.93 కోట్లు విడుదల చేశామన్నారు. రెండవ విడతలో లక్ష నుండి లక్ష యాబై వేల వరకు రుణాలు ఉన్న 6,40,823 ఖాతాదారులకు 6190.01 కోట్లు విడుదల చేయడం జరిగిందన్నారు.
మూడవ విడుతలో అనగా ఆగస్టు 15, 2024 నాడు 2 లక్షలలోపు రుణాలు 4,46,832 ఖాతాలలో 5644.24 కోట్ల నిధులు విడుదల చేశామన్నారు తుమ్మల నాగేశ్వర్ రావు.