బస్సుల సంఖ్యను పెంచండి – కేటీఆర్
ప్రభుత్వానికి సూచించిన మాజీ మంత్రి
హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీరియస్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో ప్రయాణీకుల సంఖ్యకు అనుగుణంగా బస్సులను పెంచక పోవడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆదివారం కేటీఆర్ ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ సందర్బంగా ఆయన నిర్మల్ జిల్లాలో చోటు చేసుకున్న బస్సు ప్రమాద ఘటనకు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. 50 మంది ప్రయాణం చేయాల్సిన బస్సులో 170 మంది ఎక్కడం దారుణమన్నారు.
మోరపల్లి వద్ద నిర్మల్ బస్సుకు చెందిన రెండు టైర్లు ఊడి పోయాయని తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని, సురక్షితంగా బయట పడ్డారని పేర్కొన్నారు కేటీఆర్. ఉచిత బస్సు పథకం కారణంగా బస్సులలో నిత్యం రద్దీ పెరిగి పోతోందని అయినా బస్సులను పెంచక పోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
సంస్థ అసలు ఏం చేస్తోందని ప్రశ్నించారు కేటీఆర్. 8 గంటల కంటే ఎక్కువగా డ్రైవర్లు, కండక్టర్లు విధులు నిర్వహిస్తున్నారని, మహిళల తాకిడి ఎక్కువగా ఉండడంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారని వాపోయారు.
సిబ్బంది, ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని కోరారు.