DEVOTIONAL

శ్రీ‌వారి ఆల‌యంలో ముగిసిన పవిత్రోత్సవాలు

Share it with your family & friends

అంగ‌రంగ వైభ‌వోపేతంగా నిర్వ‌హించిన టీటీడీ

తిరుమల – తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు రోజుల పాటు అంగ‌రంగ వైభ‌వోపేతంగా జ‌రిగాయి ప‌విత్రోత్స‌వాలు. నేటితో పవిత్రోత్సవాలు పూర్ణాహుతితో ముగిశాయి.

ఇందులో భాగంగా ఉదయం యాగశాలలో ఋత్వికులు హోమాలు నిర్వహించారు. ఆ తరువాత శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారి ఉత్సవ మూర్తులకు స్నపన తిరు మంజనం చేపట్టారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపుతో అభిషేకించి చివరగా చందనం పూత పూశారు. ధూప దీప హారతులు నివేదించారు.

సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు ఆల‌య నాలుగు మాడ వీధుల్లో భ‌క్తుల‌ను క‌టాక్షించారు. ఆ తరువాత పూర్ణాహుతి నిర్వహించారు. శ్రీ మలయ్పప్ప స్వామి వారు శ్రీదేవి, భూదేవితో కలిసి విమాన ప్రదక్షిణంగా వెళ్లి ఆలయ ప్రవేశం చేయడంతో పవిత్రోత్సవాలు ముగిశాయి.

ఈ కారణంగా ఆలయంలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది.

ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, ఈవో జె.శ్యామలరావు దంపతులు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, ఆల‌య డెప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు.