DEVOTIONAL

ఆక‌స్మిక త‌నిఖీల‌తో టీటీడీ ఈవో హ‌ల్ చ‌ల్

Share it with your family & friends

భ‌క్తుల వ‌స‌తి సౌక‌ర్యాల‌పై నిరంత‌ర ఆరా

తిరుమ‌ల – కోట్లాది మందికి ఆరాధ్య దైవంగా విరాజిల్లుతున్న పుణ్య క్షేత్రం తిరుమ‌ల నిత్యం భ‌క్తుల‌తో కిట కిట లాడుతోంది. ప్ర‌తి రోజూ వేలాది మంది భ‌క్తులు ద‌ర్శించుకుంటారు స్వామి వారిని. ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ‌స‌తి సౌక‌ర్యాలు క‌ల్పించేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టింది టీటీడీ. కొత్త‌గా కొలువు తీరిన ఈవో జె. శ్యామ‌ల రావు మ‌రింత దూకుడు పెంచారు. ఆయ‌న నిత్యం త‌నిఖీల‌తో హోరెత్తిస్తున్నారు. దీంతో గాడి త‌ప్పిన టీటీడీ పాల‌న‌ను లైమ్ లైట్ లోకి పెట్టేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

ఇందులో భాగంగా తిరుమలలోని సప్తగిరి సత్రాలు, సిఆర్ఓ కార్యాలయాన్ని ఈవో జె. శ్యామ‌ల రావు, ఏఈవో వెంక‌య్య చౌద‌రి, సీవీఎ్వో శ్రీ‌ధ‌ర‌ల్ తో క‌లిసి త‌నిఖీలు చేప‌ట్టారు.

మొదట సప్తగిరి సత్రాల వద్ద గదులను పరిశీలించి కారిడార్లు, బాత్‌రూమ్‌లలో పరిశుభ్రత, స్విచ్‌బోర్డులు, జల ప్రసాదం, పరుపులు, మంచాలు, బెడ్ షీట్లను ఆయన పరిశీలించారు. గదులను ఆధునీకరించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని సంబంధిత సూచించారు.

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, డీప్‌క్లీనింగ్‌ చేపట్టాలని అధికారులను ఈవో ఆదేశించారు. తరువాత యాత్రికులతో ఈవో మాట్లాడారు. కౌంటర్ల వద్ద గదుల కేటాయింపు ప్రక్రియను పరిశీలించారు.

అనంతరం సెంట్రల్ రిసెప్షన్ కార్యాలయంలో భక్తులకు గదుల కేటాయింపు ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఎలక్ట్రానిక్ డిస్‌ప్లే బోర్డు, ఇన్ఫర్మేషన్ కియోస్క్‌లను తనిఖీ చేయడంతోపాటు కర్ణాటక, కళ్లకురిచి నుంచి వచ్చిన భక్తులతో ఈవో మాట్లాడారు.

భక్తుల సౌకర్యార్థం తిరుమలలో ఎన్ని గదులు అందుబాటులో ఉన్నాయనే సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రదర్శించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పిఎసిలలో యాత్రికులకి లాకర్లు ఎన్ని అందుబాటులో ఉన్నాయనే విషయం అనౌన్స్‌మెంట్లు చేయాలని, తద్వారా వాటి లభ్యతను బట్టి అవసరమున్న భక్తులకు కేటాయించాలని స్ప‌ష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ఎస్‌ఈ 2 సత్యనారాయణ, ఈఈలు వేణుగోపాల్, శ్రీనివాసులు, డీఈ (ఎలక్ట్రికల్) చంద్రశేఖర్, డిప్యూటీ ఈవో ఆర్2 హరీంద్రనాథ్, విజిఓలు రామ్ కుమార్, సురేంద్ర, ఏఈవో నాయుడు, ఇతర అధికారులు పాల్గొన్నారు.