NEWSTELANGANA

గురుకుల అభ్య‌ర్థుల వినూత్న నిర‌స‌న

Share it with your family & friends

రాఖీ పండుగ రోజు సీఎం రేవంత్ కు షాక్

హైద‌రాబాద్ – రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఇంటి వ‌ద్ద ఆదివారం గురుకుల అభ్య‌ర్థులు వినూత్న నిర‌స‌న చేప‌ట్టారు. ఇవాళ దేశ వ్యాప్తంగా రాఖీ పండుగ‌ను జ‌రుపుకుంటున్నారు. త‌మ‌కు న్యాయం చేయాల‌ని కోరుతూ గ‌త మూడు నెల‌ల నుంచి గురుకుల అభ్య‌ర్థులు ఆందోళ‌న చేస్తూ వ‌స్తున్నారు. అయినా స‌ర్కార్ ప‌ట్టించుకోక పోవ‌డంతో తీవ్ర ఆందోళ‌న చెందుతున్నారు.

రాఖీ పండ‌గ రోజు అయినా త‌మ గోడు వినాల‌ని కోరుతున్నారు గురుకులాల అభ్య‌ర్థులు. ఈ సంద‌ర్బంగా ఫ్లెక్సీలతో నినాదాల‌తో హోరెత్తించారు. త‌మ‌కు న్యాయం చేయాల‌ని , లేక పోతే త‌మ బ‌తుకులు బుగ్గి పాల‌వుతాయ‌ని వాపోయారు.

ప్ర‌స్తుతం మెరిట్ ప్రాతిప‌దిక‌న గురుకులాల‌లో పోస్టుల‌ను భ‌ర్తీ చేయాల‌ని కోరుతున్నారు. ఇదే డిమాండ్ తో వారంతా ఆందోళ‌న‌కు దిగారు. ఈ సంద‌ర్బంగా బాధిత అభ్య‌ర్థులంతా మాజీ మంత్రి, బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను క‌లిశారు. త‌మ గోడు వెళ్ల బోసుకున్నారు. అయినా సీఎం రేవంత్ రెడ్డి స‌ర్కార్ స్పందించ‌డం లేద‌ని వాపోతున్నారు.

రాఖీ పండుగ అంటే చెల్లెళ్లు ఏది కోరినా అన్న‌లు ఇస్తార‌ని, తమ‌ను సోద‌రీమ‌ణులుగా భావించి త‌మ‌కు న్యాయం చేయాల‌ని, మెరిట్ ఆధారంగా భ‌ర్తీ చేయాల‌ని, నియామ‌క ప‌త్రాలు ఇవ్వాల‌ని కోరుతున్నారు బాధితులు.