19న కర్ణాటకలో బీజేపీ ఆందోళన
సీఎం సిద్దరామయ్య రాజీనామా చేయాలి
కర్ణాటక – రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య రాజీనామా చేయాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆగస్టు 19న సోమవారం విధాన సౌధలో నిరసన చేపట్టనున్నట్లు ప్రకటించింది. పార్టీ అధికారికంగా ప్రకటన చేసింది.
ముడా కుంభకోణం కేసులో సీఎం సిద్దరామయ్యతో పాటు కుటుంబం కూడా భాగం ఉందంటూ ఆరోపణలు ఉన్నాయి. దీనిపై విచారణ చేపట్టాలని గత కొంత కాలంగా బీజేపీ, జేడీఎస్ పార్టీలు సంయుక్తంగా డిమాండ్ చేస్తున్నాయి.
ఇదిలా ఉండగా రాష్ట్ర గవర్నర్ గా ఉన్న గెహ్లాట్ పుండు మీద కారం చల్లినట్లు సీఎం సిద్దరామయ్యపై విచారణకు అనుమతించడం తీవ్ర రాద్దాంతానికి దారి తీసింది. ఇది పూర్తిగా కక్ష సాధింపు చర్య తప్ప మరోటి కాదని కాంగ్రెస్ సర్కార్ పేర్కొంది.
ఇదే సమయంలో ముడా కేసులో తనకు కానీ, తన కుటుంబానికి కానీ ఎలాంటి ప్రమేయం లేదని ఇప్పటికే పదే పదే ప్రకటిస్తూ వచ్చారు సీఎం సిద్దరామయ్య. ముఖ్యమంత్రిపై విచారణకు ఆదేశించే అధికారం గవర్నర్ కు లేదని స్పష్టం చేశారు.
కాగా ఓ వైపు బీజేపీ ఆందోళనలకు పిలుపు ఇవ్వగా కాంగ్రెస్ పార్టీ గవర్నర్ గెహ్లాట్ నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. ఆయన నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు సిద్దరామయ్య.