మల్లికార్జున్ ఖర్గే..రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ
ఆధారాలతో సహా లేఖలో పేర్కొన్న మాజీ మంత్రి
హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆదివారం లేఖ రాశారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు, రాయ్ బరేలి ఎంపీ రాహుల్ గాంధీలకు ఈ లేఖలను పంపించారు. ఇందులో ప్రధానంగా రాష్ట్రంలో రైతుల పరిస్థితి గురించి వివరించారు.
ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా అమలులో వైఫల్యం చెందిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల రుణాల మాఫీకి సంబంధించి తలో మాట మాట్లాడుతున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డిది ఒక మాట, మంత్రులది ఇంకో మాట చెప్పడం వల్ల రైతులు అయోమయానికి గురవుతున్నారని తెలిపారు కేటీఆర్.
బ్యాంకర్లు రైతుల రుణాల మాఫీకి సంబంధించి 48 వేల కోట్లు కావాల్సి ఉంటుందని చెప్పాయని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రూ. 17,838 కోట్లతో రుణాలు అన్నింటిని తీర్చి వేయడం జరిగిందని చెప్పడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.
రైతులు చాలా ఆగ్రహంతో ఉన్నారని, ప్రస్తుతం వర్షాలు కురియడంతో సాగు చేసే పనిలో ఉన్నారని, ఓ వైపు విత్తనాల కొరత కొనసాగుతోందని, రుణ మాఫీ కాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కేటీఆర్. వెంటనే బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న మీరు రాష్ట్రంలో జరుగుతున్న బక్వాస్ పాలనపై ఫోకస్ పెట్టాలని, రైతులకు న్యాయం చేయాలని కోరారు.