విశాఖ స్టీల్ ప్లాంట్ గనుల లీజు పొడిగింపు
ఆదేశించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి – విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని మరోసారి నిరూపించారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. గత కొంత కాలంగా సదరు సంస్థను మూసి వేస్తారని, ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీకి కేంద్రం అప్పగించ బోతోందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
ఆందోళనలు కూడా చోటు చేసుకున్నాయి. దీనిపై పూర్తిగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది రాష్ట్ర కూటమి ప్రభుత్వం. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ పరం చేసే ప్రసక్తి లేదని ఇప్పటికే ప్రకటించారు భారతీయ జనతా పార్టీ ఏపీ చీఫ్ , రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి.
ఈ తరుణంలో ఢిల్లీ పర్యటన సమయంలో విశాఖ స్టీల్ కంపెనీకి సంబంధించి కీలక చర్చలు జరిపారు చంద్రబాబు నాయుడు పీఎం నరేంద్ర మోడీతో. అవసరమైతే నిధులు తాము కేటాయిస్తామని, కానీ ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ పరం అనే ఆలోచన రానీయవద్దని కోరారు.
విశాఖ ఉక్కు రాష్ట్రానికి తలమానికం అని, దీనిని కోల్పోయే ప్రసక్తి లేదని మరోసారి స్పష్టం చేశారు నారా చంద్రబాబు నాయుడు. స్టీలు ప్లాంటుకు రాష్ట్రంలో కేటాయించిన గనులకు సంబంధించి లీజు పొడిగించాలని ఆదేశించారు.
విశాఖ ఉక్కుకు విజయనగరం జిల్లా గర్భాం నుంచి మాంగనీస్ ఖనిజం నిరంతరాయంగా సరఫరా అయ్యేలా లీజును ఓకే చేశారు, లీజును 2032 అక్టోబర్ వరకు కొనసాగించేందుకు అనుమతి ఇచ్చింది.
విశాఖ ఉక్కు కర్మాగారానికి మాంగనీస్ లీజును పొడిగించినందుకు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.