సర్కార్ ను కూల్చే పనిలో బీజేపి బిజీ
నిప్పులు చెరిగిన జార్ఖండ్ సీఎం సోరేన్
గొడ్డా – జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన భారతీయ జనతా పార్టీని ఏకి పారేశారు. దేశ వ్యాప్తంగా బీజేపీ యేతర పార్టీలు ఉండ కూడదనే ఉద్దేశంతో పావులు కదుపుతోందని, దీని వెనుక కుట్రలు పన్నుతున్నారంటూ ప్రధాన మంత్రి మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా లను ఉద్దేశించి పరోక్షంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
జార్ఖండ్ లోని గొడ్డాలో జరిగిన బహిరంగ సభలో సీఎం హేమంత్ సోరేన్ షాకింగ్ కామెంట్స్ చేయడం కలకలం రేపింది. ఈ వ్యక్తులు (బీజేపీ) గుజరాత్, అసోం, మహారాష్ట్రల నుంచి ప్రజలను తీసుకొచ్చి ఇక్కడి గిరిజనులు, దళితులు, వెనుకబడిన వారిలో విషం చిమ్ముతున్నారని ఆరోపించారు .
సమాజాన్ని మరచిపోయి కుటుంబాలను విచ్ఛిన్నం చేసే పనిలో పడ్డారంటూ ఆవేదన వ్యక్తం చేశారు హేమంత్ సోరేన్. వాళ్లు పార్టీలను చీల్చే పనిలో నిమగ్నమై ఎమ్మెల్యేలను కాజేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా జేఎంఎం సీనియర్ నాయకుడు చంపై సోరేన్ పార్టీని వీడనున్నట్లు సమాచారం. ఈ తరునంలో హేమంత్ సోరేన్ ఈ కామెంట్స్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.