వైద్యుల రక్షణ కోసం బిల్లు అవసరం
కోల్ కతా డాక్టర్ రేప్..మర్డర్ కేసుపై ఎంపీ
తిరువనంతపురం – కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కోల్ కతా లో చోటు చేసుకున్న డాక్టర్ రేప్, మర్డర్ కేసు పై స్పందించారు. దారుణమైన ఘటనగా పేర్కొన్నారు. తాను గత కొన్నేళ్ల నుంచి వైద్యుల రక్షణ కోసం ప్రత్యేకంగా బిల్లు తీసుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. సోమవారం శశి థరూర్ మీడియాతో మాట్లాడారు.
RG కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ రేప్-మర్డర్ సంఘటన తనను తీవ్రంగా కలిచి వేసిందన్నారు ఎంపీ. వైద్యుల పట్ల నాకు సానుభూతి, సంఘీభావం ఉందన్నారు. కనీసం రెండేళ్లుగా వైద్యులపై జరుగుతున్న హింసాకాండపై పార్లమెంట్లో మాట్లాడుతున్నానని చెప్పారు శశి థరూర్.
అప్పటి ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియాతో తాను వాదించానని, ఆయన పట్టించు కోలేదని ఆరోపించారు. వైద్య నిపుణులను వారి విధులలో ప్రత్యేకంగా రక్షించడానికి ప్రభుత్వం ఒక బిల్లును తీసుకురావాలని తాను డిమాండ్ చేశానని చెప్పారు.
.ప్రజా చైతన్యాన్ని పెంచడానికి ఇన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, మరో వైద్యురాలు తన ప్రాణాలను కోల్పోవాల్సి రావడం పట్ల తాను దిగ్భ్రాంతి చెందానని అన్నారు శశి థరూర్. దేశ వ్యాప్తంగా ఈ ఘటన ఓ పాఠం కావాలని అన్నారు. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా మెడికల్ కాలేజీలు, ఆస్పత్రులలో సీసీ కెమెరాలతో పాటు సెక్యూరిటీని విధిగా ఉంచాలని డిమాండ్ చేశారు.