మీరు సాధించిన విజయం అపురూపం
ఢిల్లీ : భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్భుతమైన ఆతిథ్యం ఇచ్చారు భారత మహిళా క్రికెట్ జట్టుకు. ముంబై వేదికగా జరిగిన ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మహిళల వన్డే వరల్డ్ కప్ లో బలమైన దక్షిణాఫ్రికాను 5 వికెట్ల తేడాతో ఓడించింది. విశ్వ విజేతగా నిలిచింది హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు. విచిత్రం ఏమిటంటే ఈ టోర్నీలో లీగ్ లో భాగంగా మూడు మ్యాచ్ లలో ఓటమి పాలైంది టీమిండియా. ఈ సమయంలో దేశ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆపై పెద్ద ఎత్తున ట్రోలింగ్కు కూడా గురయ్యారు. ఈ తరుణంలో మొక్కవోని పట్టుదలతో సత్తా చాటారు. సమిష్టిగా రాణించారు. తమకు ఎదురే లేదని నిరూపించారు అమ్మాయిలు.
సెమీఫైనల్ మ్యాచ్ లో ఏడుసార్లు ఛాంపియన్స్ గా నిలిచిన ఆస్ట్రేలియా జట్టును మట్టి కరిపించింది. భారీ టార్గెట్ ను ఛేదించింది. జెమీమా రోడ్రిగ్స్ అద్భుతంగా రాణించింది. ఆట చివరి దాకా నిలిచింది. 134 బంతులు ఆడి 14 ఫోర్లతో 127 రన్స్ నిలిచి అజేయ సెంచరీతో ఆకట్టుకుంది. తన కారణంగానే భారత జట్టు ఫైనల్ కు చేరింది. ఆ తర్వాత కీలకమైన ఫైనల్ మ్యాచ్ లో సఫారీలను ఖంగుతినిపించింది. ప్రపంచ ఛాంపియన్ గా నిలిచారు. ఈ సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు బీసీసీఐ అధ్యక్షుడితో పాటు కార్యవర్గం , ఛాంపియన్ జట్టు కు విశిష్ట ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్బంగా వారితో 2 గంటలకు పైగా గడిపారు. ప్రతి ఒక్కరినీ పేరు పేరునా పలకరించారు. వారిని ప్రశంసలతో ముంచెత్తారు.








