రేపటి నుండి బీజేపీ సభ్యత్వ నమోదు
ఏపీలో శ్రీకారం చుట్టనున్న కమల పార్టీ
అమరావతి – దేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ సంస్థాగత పరంగా మరింత బలోపేతం కావాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కీలక సమావేశంలో పార్టీ పరంగా సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని, ఈసారి అది రికార్డు స్థాయిలో ఉండాలని స్పష్టం చేశారు.
ఈ కీలక సమావేశంలో పీఎంతో పాటు కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు పాల్గొన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఆదేశాల మేరకు ఆయా రాష్ట్రాలలో పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఇందులో భాగంగా తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన శాసన సభ, సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఊహించని రీతిలో తన ఓటు బ్యాంకును పెంచుకుంది. అంతే కాకుండా ఎమ్మెల్యేలతో పాటు ఎంపీ సీట్లను కూడా చేజిక్కించుకుంది.
ప్రస్తుతం టీడీపీ, జనసేన పార్టీలతో కలిసి కూటమి సర్కార్ లో భాగస్వామ్యం కలిగి ఉంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి సారథ్యంలో ఈనెల 21న బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని పార్టీ ప్రకటించింది. పార్టీ జాతీయ స్థాయి నేతలు హాజరవుతారని తెలిపింది.