ప్రిన్సిపాల్ నిర్వాకం సుప్రీంకోర్టు ఆగ్రహం
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ వైఫల్యంపై ఫైర్
ఢిల్లీ – దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన కోల్ కతా ట్రైనీ డాక్టర్ రేప్, మర్డర్ కేసుపై సంచలన కామెంట్స్ చేసింది సుప్రీంకోర్టు. ప్రధానంగా ఈ దారుణానికి ఒడిగట్టిన మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ మరో కాలేజీకి ఎలా మారుతాడంటూ ప్రశ్నించింది. ఇది పూర్తిగా బాధ్యతా రాహిత్యానికి పరాకాష్ట అంటూ మండిపడింది.
విచిత్రం ఏమిటంటే కాలేజీ ప్రిన్సిపాల్ ఈ కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు సీజేఐ జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం.
ఘటన జరిగిన రెండు రోజులకే ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా రాజీనామా చేసిన సందీప్ ఘోష్ ఇంకో కాలేజీలో ఎలా జాయిన్ అవుతాడని, అసలు రాష్ట్రంలో ప్రభుత్వం అనేది ఉందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నగరంలోని అత్యున్నత బోధనాసుపత్రి అయిన కలకత్తా మెడికల్ కాలేజీకి ప్రిన్సిపాల్‌గా సందీప్ ఘోష్ నియామకాన్ని ప్రస్తావిస్తూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. మహిళా వైద్యుల భద్రత దేశ ప్రయోజనాలకు సంబంధించిన అంశమని, సమానత్వ సూత్రం ఏమీ కోరదని కూడా అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.
“దేశం కొన్ని చర్యలు తీసుకోవడానికి మరొక అత్యాచారం కోసం వేచి ఉండదు. వైద్య నిపుణులను రక్షించడానికి రాష్ట్రాల్లో చట్టాలు ఉన్నాయి, కానీ అవి వ్యవస్థాగత సమస్యలను పరిష్కరించడం లేదు” అని ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ అన్నారు.