బెంగాల్ సర్కార్ పై సీజేఐ సీరియస్
నిరసనకారులపై దాడులు చేస్తారా
ఢిల్లీ – కోల్ కతా వైద్యురాలి అత్యాచారం, హత్య ఘటనకు సంబంధించిన కేసు విచారణ సందర్బంగా భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం రక్షించాల్సింది పోయి బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తే ఎలా అని ప్రశ్నించారు సీజేఐ. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు.
ఈ మొత్తం ఘటనను పక్కదోవ పట్టించేందుకు ప్రిన్సిపాల్ ప్రయత్నం చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన అనేది ప్రజాస్వామ్యంలో హక్కు అని, ఆందోళన బాట పట్టిన వారి పట్ల కఠినంగా వ్యవహరించడం దారుణమన్నారు సీజేఐ జస్టిస్ చంద్రచూడ్.
బెంగాల్ ప్రభుత్వం తన అధికారాన్ని నిరసనకారులపై ప్రయోగించ కూడదని స్పష్టం చేశారు. ఇది అప్రజాస్వామికమని స్పష్టం చేశారు. దీనిని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని కుండ బద్దలు కొట్టారు సీజేఐ.
న్యాయమూర్తులు జెబి పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఎఫ్ఐఆర్ను దాఖలు చేయడంలో జాప్యం చేసినందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, ఆసుపత్రి పరిపాలన విభాగం బాధ్యులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిని అణిచి వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం బలప్రయోగం చేయరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.