కేటీఆర్ పై పోలీసులకు ఎంపీ ఫిర్యాదు
సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత కామెంట్స్
హైదరాబాద్ – కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పై నిప్పులు చెరిగారు. తమ పార్టీ చీఫ్ , రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై అనుచిత కామెంట్స్ చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు.
ఈ సందర్బంగా తనపై కేసు నమోదు చేయాలని కోరుతూ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు. కేటీఆర్ సీఎం గురించి అవాకులు చెవాకులు పేలాడని, తన స్థాయికి తగ్గ కామెంట్స్ చేయడం మంచి పద్దతి కాదన్నారు. వెంటనే కేటీఆర్ పై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేశారు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్.
ఎంపీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపిస్తామని, తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన అనంతరం ఎంపీ మాట్లాడారు. గత కొంత కాలంగా సీఎంగా రేవంత్ రెడ్డి కొలువు తీరినప్పటి నుండి కేటీఆర్ కావాలని చులకన చేస్తూ మాట్లాడుతున్నాడని ఆరోపించారు. ఇలాంటి కామెంట్స్ చేయడం మానుకోవాలని సూచించారు.