రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తాం – కేటీఆర్
అధికారంలోకి వచ్చేది బీఆర్సేనని కామెంట్
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో మాటల యుద్దం మళ్లీ మొదలైంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య ఆరోపణలు ప్రారంభం అయ్యాయి. ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. రాజకీయాలను మరింత రక్తి కట్టిస్తున్నారు.
తాజాగా మంగళవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తాము అధికారంలోకి వచ్చాక తొలగిస్తామని ప్రకటించారు. ఇందులో ఎలాంటి డౌట్ లేదన్నారు మాజీ మంత్రి.
ఆయనకు తెలంగాణ ప్రాంతంతో ఏం సంబంధం ఉందని ప్రశ్నించారు. ఆనాడు మాజీ ముఖ్యమంత్రి అంజయ్యను అవమానించ లేదా అని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలు అన్నింటిని గమనిస్తున్నారని, సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడి ఆత్మ గౌరవాన్ని కించ పర్చేలా ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు కేటీఆర్.
సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని తాము గతంలో ప్రతిపాదించామని చెప్పారు. కానీ ఇదే స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అనుకోవడం అవమానించడం తప్ప మరోటి కాదన్నారు కేటీఆర్.