మోదీ పాలనలో దేశం ఆగమాగం
నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ
అస్సాం – ఈ దేశంలో మోదీ సర్కార్ ప్రజల పాలిట శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ. భారత్ జోడో న్యాయ్ యాత్ర అస్సాంలో కొనసాగుతోంది. ఈ సందర్బంగా జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం తారా స్థాయికి చేరుకుందని ధ్వజమెత్తారు.
ఈ దేశంలో అతి పెద్ద సమస్య నిరుద్యోగమని, లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక నానా తంటాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ మంతటా ఇదే పరిస్థితి నెలకొందన్నారు. చిన్న తరహా పరిశ్రమలను నిర్వీర్యం చేయడం వల్లనే ఇదంతా నెలకొందన్నారు.
ఇప్పటి వరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన వ్యక్తిగత ప్రచారం కోసం పని చేస్తున్నారే తప్పా దేశం బాగోగుల గురించి ఏ మాత్రం పట్టించు కోవడం లేదని ఆరోపించారు రాహుల్ గాంధీ. వేలాది మంది ఇవాళ కూలి కోసం రోడ్ల మీద నిలిచి ఉన్నారని పేర్కొన్నారు. ఇది చాలా తీవ్రమైన అంశమని ప్రధాని సైతం ఒప్పుకున్నారని కానీ చర్యలు చేపట్టిన దాఖలాలు లేవన్నారు.
నిరుద్యోగం పెను భూతంగా మారిందని, దానిని యుద్ద ప్రాతిపదికన నిర్మూలించక పోతే అది ప్రమాదకరంగా తయారు కావడం ఖాయమని పేర్కొన్నారు.