ఫామ్ హౌస్ నాది కాదు లీజుకు తీసుకున్నా
నా స్నేహితుడిదన్న మాజీ మంత్రి కేటీఆర్
హైదరాబాద్ – జన్వాడ ఫాం హౌస్ ను కూల్చి వేయొద్దంటూ కోర్టును ఆశ్రయించడం కలకలం రేపింది. ఇది పూర్తిగా మాజీ మంత్రి కేటీఆర్ ది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీనిని రేపటి దాకా కూల్చ వద్దంటూ కోర్టు ఆదేశించింది. ఈ సందర్బంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.
బుధవారం సోషల్ మీడియా వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. జన్వాడ ఫామ్ హౌస్ తనది కాదని, తనదంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అబద్దమని అన్నారు. ఇదంతా కావాలని కామెంట్స్ చేస్తున్నారంటూ ఖండించారు.
తనకంటూ ఎలాంటి ఫామ్ హౌస్ లేదన్నారు. అయితే జన్వాడ ఫామ్ హౌస్ తన స్నేహితుడిదని స్పష్టం చేశారు. తాను కొంత కాలం పాటు లీజుకు తీసుకున్నట్లు పేర్కొన్నారు కేటీఆర్.
అది ఒకవేళ నిజంగానే ఎఫ్ టీ ఎల్ , బఫర్ జోన్ లో ఉంటే తన మిత్రుడికి తెలియ చేస్తానని, ప్రభుత్వం తీసుకునే చర్యలకు సహకరించాలని కోరుతానని చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతల ఫామ్ హౌస్ లు, అక్రమాలు కూడా బయట పెట్టాలని కోరారు.
ఇందులో రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే , వీ6 ఛానల్ , పేపర్ అధినేత ఎమ్మెల్యే వివేక్ కు చెందిన వాటిపై కూడా విచారణ జరపాలని డిమాండ్ చేశారు కేటీఆర్.