రుణ మాఫీ బోగస్ సర్కార్ బక్వాస్
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్
హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. బుధవారం తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రుణ మాఫీ విషయంలో మోసం చేసిందని ఆరోపించారు. రైతులను నట్టేట ముంచిందన్నారు.
అధికారంలోకి వచ్చిన రోజే రూ. 2 లక్షల రుణ మాఫీ అంటూ ఉత్తర కుమార ప్రగల్భాలు పలికారని ఎద్దేవా చేశారు కేటీఆర్. ఇప్పటికైనా చేసిన తప్పు గురించి బయటకు చెబుతారని అనుకున్నామని, కానీ అదేదీ తమకేమీ పట్టనట్టు ఉన్నారని ఆరోపించారు.
రుణ మాఫీ అనేది బూటకం, పచ్చి దగా, పచ్చి మోసం అంటూ నిప్పులు చెరిగారు కేటీఆర్. రవ్వంత రుణ మాఫీ చేసి కొండంత డబ్బా కొట్టుకున్న ముఖ్యమంత్రి బండారం 70 లక్షల మంది రైతుల సాక్షిగా బట్ట బయలైందని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.
వ్యవసాయ శాఖ మంత్రి ఏమో రూ. 2 లక్షలు మాఫీ చేశాం అంటూ ప్రకటన చేశారని, కానీ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాత్రం ఇంకా చేయాల్సి ఉందని అంటున్నారని చెప్పారు.
సీఎం అయితే ఏకంగా ప్రచారం చేసుకోవడంలోనే ముందంజలో ఉన్నారని , మరో వైపు రైతులు రోడ్ల పైకి వచ్చినా సోయి లేకుండా ఉండడం దారుణమన్నారు కేటీఆర్.