ఆర్ఆర్ఆర్ భూ సేకరణ వేగం పెంచాలి
స్పష్టం చేసిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) ప్రగతిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేపట్టారు. పనుల పురోగతి ఏమిటనే దానిపై రోజు వారీ సమీక్ష చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. భూ సేకరణ, ఇతర విషయాలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్ సమాచారం తనకు అందజేయాలని సూచించారు.
ఆర్ఆర్ఆర్ ప్రగతిపై రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి బుధవారం సమీక్ష నిర్వహించారు. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగంలో భూ సేకరణ, పనులకు సంబంధించిన వివరాలను అధికారులు తెలియజేశారు.
భూ సేకరణ వేగం పెరగాలని, ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగంలోని కలెక్టర్లు ఈ రహదారి విషయంలో రోజు వారీగా ఏం చేశారు… ఏం పురోగతి సాధించారు, దక్షిణ భాగంలో భూ సేకరణ ప్రక్రియ ప్రారంభం, ఇతర అంశాలపై ప్రతి రోజు సాయంత్రానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వివరాలు అందజేయాలన్నారు.
భూ సేకరణలోనూ పారదర్శకంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు సీఎం. సీఎస్‌తో పాటు మౌలిక వసతులు, ప్రాజెక్టుల సలహాదారు శ్రీనివాసరాజు, ముఖ్యమంత్రి ఓఎస్డీ షానవాజ్ ఖాసీం, ఆయా జిల్లాల కలెక్టర్లు, ఆర్ అండ్ బీ ఉన్నతాధికారులతో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఎప్పటికప్పుడు పనుల పురోగతిని అందులో అప్‌డేట్ చేయాలని సూచించారు. ఒక సమీక్ష సమావేశానికి మరో సమీక్ష సమావేశానికి మధ్య కాలంలో పురోగతి తప్పనిసరిగా ఉండాలని అన్నారు.
ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం సంగారెడ్డి-ఆమన్‌గల్-షాద్ నగర్-చౌటుప్పల్ (189.20 కి.మీ.) మార్గానికి సంబంధించి భూ సేకరణ ప్రారంభించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఉత్తర భాగంలో ఇప్పటికే భూ సేకరణ చాలా వరకు పూర్తయినందున, దక్షిణ భాగంలోనూ ప్రారంభించాలన్నారు.
ఈ రోడ్డు విషయంలో ఏవైనా సాంకేతిక, ఇతర సమస్యలుంటే కేంద్ర ప్రభుత్వంతో చర్చించాలని, అదే సమయంలో పనుల విషయంలో ముందుకు సాగాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆర్ఆర్ఆర్ మొత్తం మ్యాప్‌ను గూగుల్ మ్యాప్ ద్వారా రేవంత్ రెడ్డి పరిశీలించారు.
తాను సూచించిన మార్పులకు సంబంధించి క్షేత్ర స్థాయిలో పర్యటించి సమగ్ర నివేదికను త్వరగా అందజేయాలని సీఎం ఆదేశించారు. ఫ్యూచర్ సిటీకి సంబంధించి రేడియల్ రోడ్ల నిర్మాణంపైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు పలు సూచనలు చేశారు.
సమావేశంలో రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి వి.శేషాద్రి, ఓఎస్డీ షానవాజ్ ఖాసీం, ఆర్ అండ్ బీ ప్రత్యేక కార్యదర్శి దాసరి హరిచందన పాల్గొన్నారు.