శాసన మండలిలో ప్రజా గొంతు వినిపిస్తా
స్పష్టం చేసిన బొత్స సత్య నారాయణ
అమరావతి – విశాఖ జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన మాజీ మంత్రి బొత్స సత్య నారాయణ బుధవారం శాసన మండలికి విచ్చేశారు. ఈ సందర్బంగా ఆయనతో మండలి చైర్మన్ ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయించారు.
అనంతరం బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు జిల్లాలోని ప్రతి ఒక్క పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధికి తాను శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఎలాగైనా సరే ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గెలవాలని ప్లాన్ చేసిందని, కానీ తాను ఉన్నంత వరకు అది వర్కవుట్ కాదని తేలి పోయిందన్నారు.
చివరకు అభ్యర్థిని బరిలో దింప కుండానే విరమించు కోవడంతో తన గెలుపునకు అడ్డు లేకుండా పోయిందన్నారు. తాను ప్రజా ప్రతినిధిగా , మంత్రిగా ప్రజలతో కలిసి ఉన్నానని, ఉత్తరాంధ్రను ఎన్నటికీ మరిచి పోలేనని చెప్పారు బొత్స సత్యనారాయణ.
తనను, తన కుటుంబాన్ని అక్కున చేర్చుకుని ఆదరిస్తున్న ప్రజలందరికీ రుణపడి ఉంటానని అన్నారు . ఇదిలా ఉండగా తనపై నమ్మకం ఉంచి తనకు టికెట్ కేటాయించి, తనను గెలిపించేలా చేసిన తమ పార్టీ బాస్, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు బొత్స సత్యనారాయణ. ఈ సందర్బంగా తన వాయిస్ ను ఎప్పటి లాగే శాసన మండలిలో వినిపిస్తానని చెప్పారు.