త్వరలో మహిళలకు ఫ్రీ జర్నీ – బాబు
ఉచిత బస్సు పథకంపై సీఎం సమీక్ష
అమరావతి – ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీలను అమలు చేయడంపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఏపీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో నడిచే బస్సులలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేసేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.
ఆర్టీసీపై సచివాలయంలో నారా చంద్రబాబు నాయుడు సమీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా కాలం చెల్లిన బస్సులను నిలిపి వేయాలని, వాటి స్థానంలో కొత్తగా విద్యుత్ బస్సులను కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు.
మహిళలకు ఉచిత బస్సు పథకంపై అధికారులతో సీఎం చర్చించారు. ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఢిల్లీ, కర్నాటక, పంజాబ్, తమిళనాడుతో పాటు ఆయా రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ఉత్తమ విధానాలపై అధికారులు పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి నివేదిక రూపొందించాలని ఆదేశించారు.
రెండు రోజులు ఆలస్యమైనా లోపాలకు తావు లేకుండా, మహిళలు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండేలా విధానాలు తయారు చేయాలని స్పష్టం చేశారు నారా చంద్రబాబు నాయుడు.