సీఎంను కలిసిన మందకృష్ణ మాదిగ
ఎస్సీ వర్గీకరణ అమలుకు రేవంత్ ఓకే
హైదరాబాద్ – మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ గురువారం హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఎస్సీ వర్గీకరణపై భారత దేశ సర్వోన్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టు ఇటీవలే కీలక తీర్పు వెలువరించింది.
భారత రాజ్యాంగం ప్రకారం మాదిగలలోని ఉప కులాలకు కూడా రిజర్వేషన్లు వర్తింప చేయాలని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్బంగా ఇదే కోర్టు ఇచ్చిన తీర్పు గురించి ప్రత్యేకంగా సీఎం ఎ. రేవంత్ రెడ్డికి వివరించారు మందకృష్ణ మాదిగ.
ఈ సందర్బంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను ప్రత్యేకంగా అభినందలతో ముంచెత్తారు ముఖ్యమంత్రి. గత కొన్నేళ్లుగా చేస్తున్న పోరాటం తనను కూడా ప్రభావితం చేసిందని స్పష్టం చేశారు. మొక్కవోని దీక్షతో ఎట్టకేలకు సాధించారని ప్రశంసించారు ఎ. రేవంత్ రెడ్డి.
సీఎం కలిసిన వారిలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ , ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కవ్వంపల్లి సత్య నారాయణ, కాలె యాదయ్య, లక్ష్మీ కాంత రావు, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు, మాజీ ఎంపీ పసునూరి దయాకర్ ఉన్నారు.