ఎమ్మెల్సీ కవితకు మరోసారి అస్వస్థత
ఢిల్లీ ఎయిమ్స్ లో వైద్య పరీక్షలు
ఢిల్లీ – బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఆమె గత కొన్ని రోజులుగా తీహార్ జైలులో ఉన్నారు. గైనిక్ సమస్యతో పాటు వైరల్ ఫీవర్ రావడంతో ఆమెను హుటా హుటిన ఢిల్లీ లోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్ ) కు తరలించారు.
జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవితకు ఉన్నట్టుండి జ్వరం రావడం, ఇబ్బంది పడడంతో వెంటనే జైలు డాక్టర్ ప్రాథమిక చికిత్స అందించారు. వైద్యుల సూచనల మేరకు ఎయిమ్స్ కు తరలించారు పోలీసులు. గట్టి బందోబస్తు మధ్య ఎమ్మెల్సీ కవితను ఆస్పత్రికి తీసుకు వచ్చారు.
ఇదిలా ఉండగా ఏమంత ఆందోళన చెందాల్సిన పని లేదని, కవిత ఆరోగ్యం బాగానే ఉందని, త్వరలోనే కోలుకుంటుందని వైద్యులు చెప్పినట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితతో పాటు ఆప్ చీఫ్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేశారు.
కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆమెతో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు. భారీ ఎత్తున ముడుపులు తీసుకుందని, ఆమెనే సెంటర్ పాయింట్ గా ఉంటూ లిక్కర్ దందా చేసిందని ఆరోపించింది ఈడీ. దీంతో కోర్టు ఆమెను జైలుకు తరలించాలని ఆదేశించింది.