రైతులకు ఆందోళన చేసే టైం లేదు
కేంద్ర మంత్రి రవనీత్ బిట్టు కామెంట్స్
ఢిల్లీ – కేంద్ర సర్కార్ అనుసరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన రైతు నాయకుడు రాకేశ్ టికాయత్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి రవనీత్ బిట్టూ. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కొందరు నాయకులకు పని లేకుండా పోయిందన్నారు. వారికి పొద్దస్తమానం బ్లాక్ మెయిల్ చేయడం తప్ప మరో పనేమీ లేదని సంచలన ఆరోపణలు చేశారు.
గతంలో విదేశాల నుంచి వచ్చే నిధులతో రైతుల పేరుతో ఉద్యమాలు చేశారని మండిపడ్డారు. ఇప్పుడు అంత సీన్ లేదంటూ ఎద్దేవా చేశారు. ప్రస్తుతం పంటలు సాగు చేసుకోవడంలో ,ఇతర పనుల్లో రైతులు బిజీగా ఉన్నారంటూ పేర్కొన్నారు కేంద్ర మంత్రి రవనీత్ బిట్టూ.
రైతు నాయకులు పంజాబ్ పురోగతిని అనుమతించడం లేదని మండిపడ్డారు. వారి జేబులు నింపుకునేందుకు బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు . వారంతా బీజేపీ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. అయినా వారి ఆటలు సాగవని హెచ్చరించారు రవనీత్ బిట్టూ.
దేశ వ్యాప్తంగా రైతులు చాలా సంతోషంగా ఉన్నారని, తాము వచ్చాక వారికి సరైన మద్దతు ధర లభిస్తోందని పేర్కొన్నారు. మొత్తంగా రైతు నేతలపై సెటైర్లు వేయడం కలకలం రేపింది.