
శైవ క్షేత్రం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శివ స్వామి
ఈ లోకంలో అత్యున్నతమైన స్థలం భారత దేశం. సర్వ మతాలు, ఎన్నో కులాలు, ప్రాంతాలతో కూడుకుని ఉన్న అరుదైన క్షేత్రం. ఈ ప్రాంతం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎంతో పుణ్యం చేసుకుంటేనే తప్పా ఈ పుణ్యభూమిలో పుట్టరు. యావత్ ప్రపంచానికి మార్గ నిర్దేశనం చేస్తున్నది ఇదే. ఇక్కడ దొరకనది అంటూ ఏదీ లేదు. ప్రతి ఒక్కరికీ చోటు ఉంటుంది ఇక్కడ. శాంతి, ధర్మం, మానవత్వమే మతంగా హిందూత్వం కొనసాగుతోంది. ఇది ఒకటా రెండా కానే కాదు వేన వేల సంవత్సరాలుగా , అనాది నుంచి కొనసాగుతూ వస్తోంది. పవిత్రమైన నదుల సంగమం కొనసాగుతున్నది ఇక్కడే. ఈ ప్రాంతం సకల దేవుళ్లకు నిలయం. అందుకే దీనిని కర్మ భూమి అన్నారు. నా మతం ఒక్కటే అది మానవత్వం. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేను తల వంచను అని ప్రకటించారు శైవ క్షేత్రం మహా సంస్థానం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శివ స్వామి.
ధర్మం కోసం, దేశం కోసం నా ప్రాణాన్ని త్యాగం చేసేందుకు సర్వదా సిద్దంగా ఉంటాను. అందుకే భవ బంధాలను తెంచుకుని కేవలం శివారాధనలో నిమగ్నమై ఉన్నాను. నా గమ్యం ఒక్కటే అదే ప్రతి ఒక్కరిలో దైవ భావన కలిగి ఉండాలి. మనకున్న సాంస్కృతిక, పునరుజ్జీవన నాగరికతకు దర్పణంగా అడుగులు వేయాలి. ఆ దిశగా నేను ప్రయాణం చేస్తున్నాను. ఈ అలుపెరుగని బాటలో ఎన్నో ముళ్లను దాటుకుంటూ వచ్చాను. కష్టాలను, కన్నీళ్లను తట్టుకుని నిలబడ్డాను. కేవలం ధర్మం కోసం. నీతి, నిజాయితీ, నిబద్దతతో కూడిన జీవితమే నేను కోరుకున్నది. అదే నాలో ప్రవహించే శివాత్మక భావన నన్ను దేదీప్యమానం చేస్తోంది. నాకు కులం లేదు, మతం లేదు..నాకు ఈర్ష్యా ద్వేషం అన్నది లేదు. కానీ నా మాటలు కఠినంగా ఉంటాయి. ఎందుకంటే నేను సత్యాన్ని ప్రేమిస్తాను. నిజాన్ని ఆచరిస్తాను. సత్యంతో కూడిన మానవత్వమే మతంగా నేను భావిస్తాను కనుక నేను కొందరికి ఇబ్బందిగా అనిపించడంలో తప్పు లేదు. అది వారి ఆలోచన మాత్రమే. వాస్తవం అర్థమైన రోజున వారంతా నన్ను ఆచరించడం మొదలు పెడతారు.
ఎవరి మతం వారిదే. కాదనం..కానీ ఇతరుల మతం తమకంటే గొప్పదని, ఇతరులను, వారి విశ్వసించే మతాలను కించ పరిచేలా మాట్లాడినా, లేదా తూల నాడినా లేదా దూషించినా , విమర్శించినా నేను తట్టుకోలేను. అప్పుడు నాలో నేను ప్రాణ ప్రదంగా ఆరాధించే..నాలో ప్రవహించే శివుడు ఆవహిస్తాడు. అప్పుడు నేను రౌద్ర రూపాన్ని దాలుస్తా. ఈ లోకం అందరిదీ. ఏ ఒక్కరికో చెందినది కాదు. ఈ పవిత్ర భరతమాత భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు శాంతి స్వభావులే. కానీ కొందరే తమ స్వార్థ ప్రయోజనాల కోసం, తమ వ్యక్తిగత పనుల కోసం, తమ ప్రచారం కోసం దుష్ప్రచారం చేస్తున్నారు. వారి మీదే నా ధర్మ యుద్దం. నా మతానికి భంగం కలిగినా నా ధర్మానికి చేటు కలిగినా , చేయాలని చూసినా నేను ఊరుకోను. వారితో పోట్లాడేందుకు సిద్దంగా ఉంటాను. ధర్మం నాలుగు పాదాల మీద నడవాలని ఎళ్లప్పుడూ కోరుకుంటా. నిత్యం ధ్యానంలో ఉంటా. లోకమంతా వ్యాపించిన ఆ పరమ శివుడు, పార్వతీ దేవి ఆరాధనలో నిమగ్నమై ఉంటాను. అందుకే నా ఆరాధ్య దేవతల కోసం నేను అష్టకష్టాలు పడి మా కుటుంబ సభ్యులను ఒప్పించి, ఉన్న ఆస్తులను అమ్మేసి శైవ క్షేత్రం మహా సంస్థానాన్ని నిర్మించాను. ఇది నా ఒక్కడి వల్ల కాలేదు. సాక్షాత్తు పరమ శివుడే నాతో చేయించాడు. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే కోటి లింగాలు. శైవ క్షేత్రం అందరికీ ఆలంబనగా ఉంటుంది. ఇక్కడ హుండీ ఉంటుంది కానీ ఏ ఒక్క పైసా ఇతర పనులకు ఖర్చు చేయం. కేవలం అన్నార్థుల, అభాగ్యుల, భక్తుల ఆకలిని తీర్చేందుకు మాత్రమే ఉపయోగిస్తాం. ఇది నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంటుంది. ఇదంతా నా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన అరుదైన అవకాశం.
ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో మరిచి పోలేని జ్ఞాపకాలు ఉన్నాయి. నన్ను ఇబ్బంది పెట్టాలని చూశారు. ఇప్పటికీ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ నేను ఏనాడూ ఎప్పటికీ తల వంచను. తల దించను. ఒకవేళ ఆ పరిస్థితే వస్తే నేనంటూ ఉండను. నేను నేర్చుకున్నది ఒక్కటే ధర్మ బద్ధంగా జీవించడం. చేతనైతే ఉన్నదాంట్లో సాయం చేయడం. పదుగురికి పంచడం. ఇది నా కుటుంబ వారసత్వంగా వచ్చింది. నా పూర్వీకులు స్వాతంత్ర సమరయోధులు, బాగా ఉన్నవాళ్లు. కానీ ఏనాడూ ఈ క్షేత్ర నిర్మాణానికి ఎవరినీ చేయి చాచి అడిగింది లేదు . శైవ క్షేత్రం మహా సంస్థాన్ని నడపడం రోజు రోజుకు భారంగా మారుతోంది. అయినా కష్టాలు పడుతూ నడిపిస్తూ వస్తున్నాం. ఇదంతా దైవ సంకల్పం. ఆ గురు దేవుడు, శివ పార్వతులే నన్ను అడుగులు వేసేలా శక్తిని ప్రసాదిస్తున్నారు. ఆ శక్తే నన్ను అడుగులు వేసేలా చేస్తోంది. ఈ క్షేత్రంలోకి వచ్చిన వారంతా దేవుళ్లైన స్వామి, అమ్మ వార్లను దర్శించుకుంటారు. ఆ తర్వాత ప్రశాంతంగా తమ గమ్య స్థానాలకు చేరుకుంటారు.
ఇక్కడ భగవంతుని మహిమలతో పాటు మానవత్వంతో కూడిన దైవ భావన ఉంటుంది. 45 మందికి పైగా ఈ క్షేత్రంలో సేవలు అందిస్తున్నారు. ఇది ఒక్కరి వల్ల అయ్యే పని కాదు..ఎందరో భక్తులు తమకు తోచిన రీతిలో సాయం చేస్తూ ఉంటారు. ప్రతి దానికీ లెక్క ఉంటుంది. నిజం నా నైజం..ధర్మం నా గమ్యం ఇదే నా ఆశయం. ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా పీఠాధిపతిగా, స్వామీజీగా ముందుంటాను. ఆ మధ్యన అన్యమతస్థుడిని టీటీడీ చైర్మన్ గా నియమించినప్పుడు ప్రశ్నించాను. ఇక్కడి నుంచి వేలాది మందితో టీటీడీని ముట్టడించేందుకు పిలుపునిచ్చాను. నన్ను అరెస్ట్ చేసేంత దాకా వెళ్లింది. అయినా వెనక్కి తగ్గలేదు . మనుషులు బాగుండాలని కోరుకునే వ్యక్తిని నేను. ప్రస్తుతం హిందూ ధర్మం ప్రమాదంలో ఉంది. దానిని పరిరక్షించు కోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందూవుపై ఉందని నేను నమ్ముతాను. అందుకే విశ్వ ధర్మ పరిరక్షణ వేదికను ఏర్పాటు చేశాను. ధర్మాన్ని పరిరక్షిండం కోసం ధర్మో రక్షతి రక్షితః ట్రస్టు రూపు దిద్దుకుందని స్పష్టం చేశారు శివ స్వామి.
సర్వ సంప్రదాయ సమ్మేళనం చేపట్టారు. భిన్నమైన ఆలోచనలతో ఉన్న మఠాలను , పీఠాధిపతులను ఒకే వేదికపైకి తీసుకు రావడంలో కృషి చేశారు. శ్రీ శైవ క్షేత్ర ప్రాంతం 2004లోనే రాజధాని మహా నగరం అవుతుందని ప్రకటించారు. వ్యక్తి ఆరాధన కంటే శక్తి ఆరాధన గొప్పదంటారు. సామాన్యులకే అందలం. ఎక్కడికి వెళ్లినా , ఏ ఆలయాన్ని దర్శించుకున్నా వారికే ప్రాధాన్యత ఉండాలని అంటారు స్వామీజీ. సమాజం పట్ల చైతన్యవంతమైన భావన కలిగి ఉండాలంటారు. ఐదు సంవత్సరాల వయసులోనే వారి తండ్రి గారు కాళీమాత దర్శనాన్ని కలగ చేశారు . ఆయనకు 17 ఏళ్లప్పుడే భగవంతుడి పట్ల ఆరాధాన కలిగి ఉంది. శివుడంటే చచ్చేంత ఇష్టం. అదే తనను యోగిగా, స్వామీజీగా మారేందుకు దోహద పడింది. తల్లిదండ్రుల ప్రేరణ, గురువుల మార్గదర్శకత్వం, అమ్మమ్మ శివ భక్తురాలు కావడంతో శ్రీనివాసుడు శివ స్వామిగా మారి పోయాడు. తనకున్న ప్రాణ శక్తిపై యోగులు పరిశోదనలు కూడా చేశారు. ఈ ప్రాంతంలో శివ స్వామి కాలు మోపడంతో ఒక్కసారిగా ఆ ఊరు మారి పోయింది. ఒకసారి ధ్యానంలో ఉన్న శివ స్వామి వారికి పరమేశ్వరుని నుంచి రేపు దర్శనం అవుతున్నాను అని సందేశం అందగా ఈ విషయాన్ని క్షేత్ర పండితులకు తెలియ పరచగా వారు 600 గ్రామాలలో టంకు వేయగా. అన్ని గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు తరలి రాగా శ్రీ శైవ క్షేత్రములో శివలింగ దర్శనం కలిగింది. ఇది శివ స్వామికి ఉన్న శక్తి.
శ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారి కాలజ్ఞానంలో అమరావతి నదీ తీరాన ఒక బ్రహ్మచారి పీఠాధిపతిగా శ్రీ శైవ క్షేత్ర ప్రాంతం ఏర్పాటు చేస్తారని ఉంది. ఆ విషయం తెలిసిన మఠాధిపతి ఈ పుణ్య స్థలాన్ని సందర్శించారు. ఇది జీవితంలో మరిచి పోలేని జ్ఞాపకం అంటారు శివ స్వామి. తమిళనాడులోని అగస్తేశ్వరుని కోవెలలో గ్రామస్తుల కోరికపై రుద్ర హోమం చేయగా ఆలయ రాజ గోపురం నిర్మాణం పూర్తయినది. అగస్త్య మహా ముని దర్శనం కలుగగా భక్తులు ఓం నమః శివాయ నామంతో మార్మోమ్రోగింది. అత్రికాళేశ్వరంలో పరమేశ్వరునికి అభిషేకములు జరుపగా గర్భాలయం దివ్య వెలుగులతో నిండి పోయింది. హర హర మహాదేవ అంటూ ఆలయ పునరుద్దరణ చేశారు. ఇలాగా జీర్ణోద్దరణ చేపట్టారు శివ స్వామి. నూతన ఆలయాలపై దృష్టి పెట్టారు. 504 ఆలయాలు పూర్తయ్యాయి.
త్రిపురాంతక క్షేత్రంలో మార్గశిర పౌర్ణమి రోజు శ్రీ విద్యా హోమాన్ని జరుపుతుండగా 2 పక్షులు హోమగుండం ముందు వాలి గణపతి మంత్రాన్ని ఉచ్చరించాయి. అక్కడ ఉన్న 275 మంది భక్తులు ఈ దృశ్యాన్ని చూసి ఆనందంతో పరవశించి పోయారు. విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు శివ స్వామిలో ఉన్న శక్తిని గ్రహించారు..గుర్తించారు. అరుణాచలం అగ్ని లింగం. దానికి మహత్తు ఉంది. కానీ అక్కడ మన తెలుగు వారికి ఇబ్బందిగా ఉందని వాపోయారు. అమరాతి రాజధాని కోసం యాగం చేపట్టారు మూడుసార్లు. గ్రామ స్థాయిలలో కమిటీలు ఉన్నాయి. స్వామి వారు ఏది చెప్పినా వారంతా పాలు పంచుకుంటారు. జ్ఞాన యజ్ఞాలు చేపట్టడం, హిందూ ధర్మం గొప్పతనం వివరించడం, ఆధ్యాత్మిక భావ జలధారను ప్రజల్లోకి తీసుకు వెళ్లడంపై ఫోకస్ పెట్టారు. అన్య మత ఆరాధన వల్ల కలిగే నష్టాలను వివరించడం, మన మతంలో ఉన్న గొప్పతనం ఏమిటో బోధించడం, సమ సమాజ స్థాపన కోసం కృషి చేయడం, దేవాలయం కేంద్రంగా వ్యక్తి వికాసం, శీల నిర్మాణం, ఆదర్శ సమాజం నిర్మించడం కోసం అడుగులు వేస్తున్నారు శివ స్వామి. గోవులను సంరక్షించడం, గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించేంత వరకు తాను నిద్ర పోనంటారు. గో పరిరక్షణ జేఏసీని ఏర్పాటు చేసి వేలాది గోవులను వధశాలలకు వెళ్లకుండా నిరోధించడం , గోవుతోనే విశ్వ కళ్యాణమని తెలియ పర్చటం, శ్రీ శైవ క్షేత్ర వనితా శక్తి ఇంటర్నేషనల్ పేరుతో గ్రామ దేవతలకు ”మన అమ్మకు మన సారె మనసారా” అంటూ ఒడి బియ్యం సారె సమర్పిస్తూ అన్ని వర్గాలను ఒకటిగా చేస్తున్నారు.
ఏపీ నుంచి 21 మంది మఠాధిపతులు, తెలంగాణ నుంచి 21 మంది మఠాధిపతులతో కలిసి విశ్వ ధర్మ పరిరక్షణ వేదికగా ఏర్పడి దేశం కోసం ధర్మం కోసం పని చేస్తున్నారు. రాష్ట్రంలో రాజులు, జమిందారులు, భక్తులు దేవాలయాలకు సమర్పించిన భూములు 4 లక్షల 9 వేల ఎకరాలు ఉన్నాయి. వాటిలో ఇప్పటికే లక్ష ఎకరాలు మాయం అయ్యాయి. వాటిని కాపాడుకునేందుకు నడుం బిగించారు శివ స్వామి. ఇలాగే ఉపేక్షిస్తే రాబోయే 25 ఏళ్లలో హిందూవులు మైనార్టీలుగా మారే ప్రమాదం ఉందంటారు. జాతీయ భావన, ఆధ్యాత్మిక ఆరాధాన మరింత పెరగాలని భావిస్తారు. ధర్మంపై అధర్మం దాడి చేస్తున్నప్పుడు యోగులు, రుషులు, స్వామీజీలు , మఠాధిపతులు బయటకు రావాల్సిందేనని అంటారు. ప్రతి ఒక్కరు ధర్మ దండాన్ని ధరించాలని, లేకపోతే కనుమరుగై పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తారు శివ స్వామి. అన్ని శాస్త్రాలు, మతాల సారం ఒక్కటే. ముందు మనం మారాలి. మనలోనే మార్పు రావాలి. జాతిని వెలిగించే దీప జ్యోతులం కావాలని పిలుపునిచ్చారు. శివ స్వామి సంకల్పం గొప్పది. నెరవేరాలని ఆశిద్దాం.