NEWSTELANGANA

డీజీపీని క‌లిసి మ‌హిళా జ‌ర్న‌లిస్టులు

Share it with your family & friends

కొండారెడ్డిప‌ల్లిలో జ‌రిగిన దాడిపై ఫిర్యాదు

హైద‌రాబాద్ – తెలంగాణ‌కు చెందిన మ‌హిళా జ‌ర్న‌లిస్టులు స‌రిత‌, విజ‌యా రెడ్డి శుక్ర‌వారం రాష్ట్ర డీజీపీ జితేంద‌ర్ ను త‌న కార్యాల‌యంలో క‌లుసుకున్నారు. ఈ సంద‌ర్బంగా తమ‌పై జ‌రిగిన దాడి గురించి వివ‌రాల‌తో కూడిన విన‌తి ప‌త్రాన్ని అంద‌జేశారు.

ఆగ‌స్టు 22న రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్వంత ఊరు వంగూరు మండ‌ల ప‌రిధిలోని కొండారెడ్డిప‌ల్లికి రైతుల రుణాల మాఫీకి సంబంధించి క‌వ‌రేజ్ కోసం వెళ్లామ‌ని తెలిపారు. త‌మ‌ను అక్క‌డికి రాకుండా అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశార‌ని వాపోయారు.

తెలుగు స్క్రైబ్ కు చెందిన సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ స‌రిత‌తో పాటు మిర్ర‌ర్ టీవీ యూట్యూబ్ ఛాన‌ళ్ నిర్వాహ‌కురాలు విజ‌యా రెడ్డి తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తమ‌కు ప్ర‌శ్నించే హ‌క్కు లేదా అని అడిగారు. ఇష్టానుసారంగా , మ‌హిళ‌లు అన్న గౌర‌వం లేకుండా త‌మ‌పై దాడికి పాల్ప‌డ్డారని, ఇందులో ప్ర‌ధానంగా సీఎం రేవంత్ రెడ్డి అనుచ‌రుడు ఉన్నాడ‌ని ఆరోపించారు.

ఈ మొత్తం ఘ‌ట‌న‌కు సంబంధించి వెంట‌నే విచార‌ణ జ‌రిపించాల‌ని, న్యాయం చేయాల‌ని కోరారు. రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌ల‌కు తీవ్ర విఘాతం క‌లుగుతోంద‌ని వాపోయారు. జ‌ర్న‌లిస్టుల‌కే ర‌క్ష‌ణ లేక పోతే ఇక సామాన్య ప్ర‌జ‌ల‌కు ఏం ర‌క్ష‌ణ ఉంటుంద‌ని ప్ర‌శ్నించారు స‌రిత‌, విజ‌యా రెడ్డి.