కోమటిరెడ్డి..దామోదరతో మందకృష్ణ భేటీ
ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని విన్నపం
హైదరాబాద్ – మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎంఆర్పీఎస్) అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ శుక్రవారం మర్యాద పూర్వకంగా రాష్ట్ర మంత్రులు దామోదర రాజ నరసింహ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ఈ ముగ్గురి మధ్య కీలక చర్చలు జరిగాయి.
మాదిగల రిజర్వేషన్లకు సంబంధించి ఇటీవలే సీజేఐ చంద్రచూడ్ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. ఉప కులాలకు సైతం వర్గీకరణ చేపట్టాలని స్పష్టం చేసింది. దీనిపై పెద్ద ఎత్తున హర్షం వ్యక్తమైంది.
ఇదిలా ఉండగా అన్ని పార్టీలతో పాటు కుల సంఘాలు, ప్రజా సంఘాలు, కవులు, కళాకారులు, రచయితలు పెద్ద ఎత్తున మద్దతు పలికారు మందకృష్ణ మాదిగ చేస్తున్న పోరాటానికి. ఆయన గత 30 సంవత్సరాలుగా మాదిగలకు రిజర్వేషన్ కల్పించాలని పోరాడుతూ వచ్చారు. ఈ ప్రస్థానంలో ఎన్నో ఆటుపోట్లు, మరెన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు.
ఇదిలా ఉండగా తమకు అనుకూలమైన తీర్పు రావడంలో కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంతో పాటు ఇక్కడ కాంగ్రెస్ సర్కార్ కూడా మద్దతు ఇవ్వడం విశేషం. మొత్తంగా మందకృష్ణ మాదిగ ఇవాళ కీలకంగా మారారు.