NEWSANDHRA PRADESH

ఎసెన్షియా కంపెనీని సీజ్ చేయండి

Share it with your family & friends

ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల డిమాండ్

అమ‌రావ‌తి – అన‌కాప‌ల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లో చోటు చేసుకున్న ఘ‌ట‌న అత్యంత బాధాక‌ర‌మ‌ని తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. ఆమె శ‌నివారం మీడియాతో మాట్లాడారు. ఈ ఘ‌ట‌న‌కు పూర్తి బాధ్య‌త ఎసెన్షియా కంపెనీయేన‌ని స్ప‌ష్టం చేశారు. వెంట‌నే కంపెనీని సీజ్ చేయాల‌ని ఆమె డిమాండ్ చేశారు.

అచ్యుతాపురం మృత్యుఘోషకు, దారుణ ఘటనకు బాధ్యులు, అటు లాభాల కోసం మాత్రమే నడిచే వ్యాపారాలు, వారితో కలిసిపోయి జనాల బతుకులను బుగ్గిపాలు చేస్తున్న ప్రభుత్వాలు. పోయిన ప్రాణాలు తిరిగొస్తాయా..? బాధిత కుటుంబాల కన్నీళ్లు ఆగుతాయా..? అని తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు ఏపీపీసీసీ చీఫ్‌.

గత ఏడాడి చివరిలోనే ‘ఎసెన్షియా ఫార్మా’ నిర్వాహకాల గురించి ఓ రిపోర్టు బయట పెట్టిందని, ఎన్నో ప్రమాదాలపై హెచ్చరికలు జారీ చేసిందని వార్తలు వస్తున్నాయి. కానీ అప్పటి సర్కారు, ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన నుండి ఏమి నేర్చుకోకుండా, ఎదురు ఈ రిపోర్టుపై మౌనం వహించిందని ఆరోపించారు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి.

పట్టుమని పాతిక కిలోమీటర్ల దూరంలో కొండను పిండి చేసి రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టుకోవడానికి డబ్బు, తీరిక ఉంటాయి. కానీ కార్మికుల ప్రాణాలంటే మాత్రం లెక్క లేదని ప‌రోక్షంగా మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ప్ర‌స్తుత టీడీపీ కూట‌మి ప్ర‌భుత్వం వెంట‌నే దిద్దుబాటు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, భ‌విష్య‌త్తులో ఇలాంటి ఘ‌ట‌నలు చోటు చేసుకోకుండా చూడాల‌ని కోరారు ఏపీపీసీసీ చీఫ్‌.