పదవి పోయినా సరే ఆర్టీసీ స్థలం లీజుకు ఇవ్వం
స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు వార్నింగ్
అమరావతి – ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు నిప్పులు చెరిగారు. నర్సింపట్నంలో ఆర్టీసీ కాంప్లెక్స్ స్థలం లీజుకు ఇవ్వడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరమైతే పదవినైనా వదులుకుంటాను కానీ ఇచ్చే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు.
ఆయన స్థలాన్ని పరిశీలించారు. గత వైసీపీ ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు లీజుకు ఇచ్చిందని ఆరోపించారు. ఆనాడు తాను దానిని వ్యతిరేకించానని గుర్తు చేశారు. లీజు పొందిన వ్యక్తి ఆర్టీసీ స్థలంలో మట్టిని వేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు చింతకాయల అయ్యన్న పాత్రుడు.
డిపో మేనేజర్ ను వివరణ ఇవ్వమని కోరానని చెప్పారు స్పీకర్. లీజుదారుడికి ఎటువంటి No Objection Certificate ఇవ్వలేదని, మట్టిని వేయడానికి అనుమతులు కూడా ఇవ్వలేదని డిపో మేనేజర్ ధీరజ్ వెల్లడించారని తెలిపారు.
“అవసరమైతే నా పదవి పోయినా పర్వాలేదు, కానీ ఆర్టీసీ స్థలం మాత్రం లీజుకు ఇవ్వడం కుదరదు. రైతుల్ని ఒప్పించి అప్పట్లో ఆర్టీసీకి స్థలం సేకరించాం. దీనిని వీలైనంత వరకు ఆర్టీసీకే వినియోగించాలి. భవిష్యత్ అవసరాల కోసం ఇది ఉపయోగపడుతుంది. ఇది ప్రజల స్థలం, ప్రజలే దీనిని కాపాడుకోవాలి.
అప్పట్లో రైతులు త్యాగం చేసి ఇచ్చిన స్థలాన్ని ఇప్పుడు ఎవరో వచ్చి వ్యాపారం చేయడం అన్యాయం. దీనిపై గతంలో సీఎం చంద్రబాబు, మంత్రి అచ్చెన్నాయుడు వద్ద ప్రస్తావించానని అన్నారు.
ఈ విషయం తెలిసినా, ప్రైవేటు వ్యక్తులు మట్టిని వేసినా డిపో మేనేజర్ ఎందుకు ప్రశ్నించ లేదు? దీన్ని బట్టి చూస్తే, డిపో మేనేజర్, కాంట్రాక్టర్ కుమ్మక్కయ్యారని అనుకోవాల్సి ఉంటుందని ,వెంటనే ఆర్టీసీ సెక్యూరిటీని సస్పెండ్ చేసి, పనులు ఆపాలని స్పీకర్ ఆదేశించారు.