నాగార్జున..మూడెకరాలకు పైగా ఆక్రమణ
ఈ నటుడు మామూలోడు కాదబ్బ
హైదరాబాద్ – తను నటుడు, ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని అనుకున్నాడు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ ప్రభుత్వాన్ని మేనేజ్ చేస్తూ వచ్చాడు. దర్జాగా తనకు ఎదురే లేదని ఏకంగా ప్రభుత్వానికి చెందిన భూమిపై కన్నేశాడు. ఒకటి కాదు రెండు ఏకంగా మూడు ఎకరాలకు పైగానే ఆక్రమించుకుని దర్జాగా నిర్మాణం చేపట్టాడు అక్కినేని నాగార్జున.
నటుడిగా, యాంకర్ గా , వ్యాపారవేత్తగా పేరు పొందిన సదరు నటుడిపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు దాని దరిదాపుల్లోకి వెళ్లే ప్రయత్నం చేయలేక పోయారు. తెర వెనుక ఏం జరిగిందో తెలియదు కానీ ఇప్పుడు హైడ్రా రూపంలో అక్కినేని నాగార్జునకు బిగ్ షాక్ తగిలింది.
ఇక ఎన్ – కన్వెన్షన్ అనేది నాగార్జునకు చెందింది. దీనిని 10 ఎకరాల్లో నిర్మించారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (నార్త్ ట్యాంక్ డివిజన్ ) ప్రకారం తమ్మిడి కుంట చెరువు కిందకు వస్తుంది ఈ స్థలం. కాగా ఎఫ్టీఎల్ విస్తీర్ణం 29.24 ఎకరాలు. ఇందులో ఎన్ – కన్వెన్షన్ ఎఫ్టీఎల్ లో 1.12 ఎకరాలు, బఫర్ జోన్ లో 2 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు 2014లో నిర్వహించిన సర్వేలో గుర్తించారు.
అయితే అప్పట్లో సరస్సుకు ఎదురుగా ఉన్న ఎన్-కన్వెన్షన్ హాల్ షెడ్ మినహా జీహెచ్ఎంసీ గానీ, యాజమాన్యం గానీ కూల్చి వేయలేదు. ప్రస్తుతం వాటిని కూల్చే పనిలో పడడంతో మిగతా వారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.