కొనసాగుతున్న వరద శ్రీశైలం కళ కళ
జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి
కర్నూలు జిల్లా – కృష్ణా బేసిన్ ఎగువ పరీవాహకంలో కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీరు భారీగా పెరిగింది. శ్రీశైలం జలాశయానికి పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతోంది.
ఎగువన ఉన్న సుంకేసుల బ్యారేజీకి భారీగా వరద వస్తుండగా.. అంతే స్థాయిలో శ్రీశైలానికి వదులుతున్నారు. రెండు వైపులా జల విద్యుత్తు ఉత్పాదనతో శ్రీశైలం నుంచి 69,132 క్యూసెక్కులను నాగార్జున సాగర్‌కు వదిలేస్తున్నారు.
శ్రీశైలం జలాశయం ఘాట్ రోడ్డులో ఇటీవల కురిసిన భారీ వర్షానికి కొండ చరియలు విరిగిపడిన సంగతి తెలిసిందే.
శ్రీశైలం జలాశయానికి 1,37,849 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుండగా.. ఔట్ ఫ్లో 69,132 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 884.20 అడుగుల మేర నీటిమట్టం ఉంది.
పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలుగా.. ప్రస్తుతం 210.9946 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
కుడి,ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. వరద ఇలాగే కొనసాగితే శ్రీశైలం జలాశయ గేట్లు మరోసారి ఎత్తే అవకాశం ఉంది. మళ్లీ శ్రీశైలం గేట్లు ఎప్పుడు ఎత్తుతారోనని పర్యాటక ప్రేమికులు ఎదురు చూస్తున్నారు.