బద్లాపూర్ ఘటనపై భగ్గుమన్న శివసేన
నిప్పులు చెరిగిన ఎంపీ ప్రియాంక చతుర్వేది
ముంబై – బద్లాపూర్ లో చోటు చేసుకున్న ఘటనపై నిరసిస్తూ శనివారం శివసేన యుబిటీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టారు. ఈ సందర్బంగా శివసేన యుబిటీ ఎంపీ ప్రియాంక చతుర్వేది పాల్గొని ప్రసంగించారు.
మహారాష్ట్రంలో శివసేన బాల్ థాక్రే ఎన్డీయే సర్కార్ లా అండ్ ఆర్డర్ ను కంట్రోల్ చేయడంలో విఫలమైందని ఆరోపించారు. రాష్ట్రంలో పూర్తిగా పాలన గాడి తప్పిందని ఆరోపించారు. బాలికలు, యువతులు, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రియాంక చతుర్వేది.
గత 10 రోజుల్లో వరుసగా 12 సంఘటనలు జరిగాయని వాపోయారు. థానేలో పోక్సో చట్టం కింద ప్రతి రోజూ ఒక కేసు నమోదవుతోందని , అయినా సీఎం ఏక్ నాథ్ షిండేకు పట్టడం లేదని మండిపడ్డారు. ఆయన సోయి లేకుండా నిద్ర పోతున్నారంటూ ధ్వజమెత్తారు ఎంపీ.
దేశంలో ఉత్తర ప్రదేశ్ తర్వాత మహారాష్ట్రలో దారుణమైన నేరాలు జరుగుతున్నాయని, దీనిని ఎదుర్కోక పోతే సామాన్యులు బతికే పరిస్థితి లేదన్నారు. ప్రధానంగా మహిళలు బయటకు వెళ్లాలంటే జంకుతున్నారని అన్నారు.
అయితే సీఎం షిండే మాత్రం శివసేన యుబిటి, ఎన్సీపీ కావాలని రాజకీయం చేస్తున్నాయంటూ ఆరోపించారు.