ANDHRA PRADESHNEWS

అచ్యుతాపురం బాధితుల‌కు వైసీపీ సాయం

Share it with your family & friends

ప్ర‌క‌టించిన ఎమ్మెల్సీ బొత్స స‌త్య‌నారాయ‌ణ

విశాఖ‌పట్నం – అన‌కాప‌ల్లి జిల్లా అచ్యుతాపురంలో చోటు చేసుకున్న ఫార్మా కంపెనీ పేలుడు ఘ‌ట‌న‌లో 18 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి పైగా గాయ‌ప‌డ్డారు. ఈ సంద‌ర్బంగా వైసీపీ చీఫ్ , మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మృతుల కుటుంబాల బాధితుల‌ను, ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న క్ష‌త‌గాత్రుల‌ను ప‌రామ‌ర్శించారు. వారికి భ‌రోసా క‌ల్పించారు. ఈ సంద‌ర్బంగా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు జ‌గ‌న్ రెడ్డి. పార్టీ త‌ర‌పున ఆర్థిక సాయం చేస్తామ‌ని వెల్ల‌డించారు.

ఇదిలా ఉండ‌గా ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించారు ఎమ్మెల్సీ బొత్స స‌త్య‌నారాయ‌ణ‌. అచ్యుతాపురం ఘ‌ట‌న ప‌ట్ల త‌మ నాయ‌కుడు, తాను తీవ్ర దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేస్తున్న‌ట్లు తెలిపారు. ఇదే స‌మ‌యంలో వారి ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని కోరారు. ఇదే స‌మ‌యంలో పార్టీ ప‌రంగా త‌మ వంతు బాధ్య‌త‌గా మృతి చెందిన 18 మంది కుటుంబాల‌కు, ఆస్ప‌త్రిలో తీవ్ర గాయాల‌తో చికిత్స పొందుతున్న బాధితుల‌కు ఆర్థిక సాయం చేస్తున్న‌ట్లు తెలిపారు.

ఇదిలా ఉండ‌గా ప్ర‌మాదంలో చ‌ని పోయిన ప్ర‌తి కుటుంబానికి రూ. 5 ల‌క్ష‌ల చొప్పున ఆర్థిక సాయం చేస్తామ‌న్నారు. గాయ‌ప‌డిన వారికి రూ. ల‌క్ష చొప్పున సాయం చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌.